నేడు సి ఎం ఉత్తరాంధ్ర పర్యాటన

జన్మభూమి కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు నేడు విశాఖ,విజయనగరం జిల్లాల్లో పర్యటించనున్నారు.
నర్సీపట్నం నియోజకవర్గ పరిధిలోని ధర్మసాగరంలో జరిగే బహిరంగ సభలోపాల్గొంటారు. అనంతరం బొబ్బిలి వెళతారు.
రెండు రోజుల ఉత్తరాంధ్ర టూర్‌లో భాగంగా ఇవాళ విశాఖ, విజయనగరం జిల్లాల్లో పర్యటించనున్నారు సిఎం. ఉదయం 9:15గంటలకు పోర్టు అతిథి గృహం నుంచి బయలుదేరి బీచ్ రోడ్డులోని కోస్టల్బ్యాటరీ ఆవరణలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరి 9:50గంటలకు నర్సీపట్నం నియోజకవర్గ పరిధిలోని ధర్మసాగరం గ్రామానికి వెళతారు.ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30గంటల వరకు జరిగే జన్మభూమి - మాఊరు గ్రామసభలో పాల్గొంటారు.
అనంతరం అక్కడి నుంచి బయలుదేరి విజయనగరం జిల్లా బొబ్బిలి వెళతారు. బొబ్బిలి శాసనసభ్యులు సుజియకృష్ణ రంగారావు మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా వస్తున్నసీఎంకు ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. బొబ్బిలిలోని రాజాకళాశాల మైదానంలో జన్మభూమి కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. సభ ఏర్పాట్లపై మంత్రులు గంటాశ్రీనివాసరావు, సుజియకృష్ణ రంగారావులు అధికారులతో సమీక్ష జరిపారు.
శ్రీకాకుళం పర్యటన తర్వాత విశాఖ చేరుకున్న చంద్రబాబు పోర్టు గెస్ట్ హౌజ్‌లో జన్మభూమి మా ఊరు కార్యక్రమం నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈకార్యక్రమంపై సెక్రెట్రీస్, హెచ్‌వోడీలతో సమీక్షించారు. జన్మభూమి మా ఊరు కార్యక్రమం కోసమే ప్రతీ జిల్లాకు ఒక సెక్రెట్రీని నియమించారు. ప్రజల నుంచి అందే వినతుల పరిష్కారానికి అత్యధికప్రాధాన్యం ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారు. ఏ రోజు అందిన పిటిషన్లను ఆరోజు ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసి పరిష్కరించాలని అన్నారు. అంశాల వారీగా ప్రజల నుంచి సేకరించిన ఫీడ్‌బ్యాక్‌ను ఆధారంచేసుకుని ప్రజలు సంతృప్తి , అసంతృప్తి వ్యక్తంచేసిన అంశాలను పేర్కొంటూ రేటింగ్స్ ఇవ్వాలని ఆదేశించారు. బొబ్బిలి పర్యటన తర్వాత సీఎం సాయంత్రం విజయవాడకు తిరుగు పయనమవుతారు.
