రేషన్ తూకంలో తేడా..

రేషన్ పంపిణీలో అవకతవకలకు మొత్తం బాధ్యత డీలర్లదేనంటూ వాదిస్తోన్న పౌరసరఫరాలశాఖ అధికారులకు... లీగల్ మెట్రాలజీ దాడులు కళ్లు తెరిపిస్తున్నాయి! రేషన్ షాపులకు సరుకులు పంపిణీ చేయాల్సిన మండల లెవెల్ స్టాక్ (ఎంఎల్‌ఎస్) పాయింట్లలో అధికార యంత్రాంగ చేతివాటం కనిపిస్తోంది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా చేసిన దాడుల్లో 15 కేసులు నమోదయ్యాయి. బియ్యం తరలించే లారీల వేబ్రిడ్జిలు, ఎంఎల్‌ఎస్ పాయింట్లలోని కాటాలను పరిశీలించగా తక్కువ తూకం వేస్తున్నట్లు తేలింది. అత్యధికంగా కృష్ణాజిల్లా ఉయ్యూరు ఎంఎల్‌ఎస్ పాయింట్‌లో 4శాతం తూకం తక్కువగా వెళ్తోందని అధికారులు గుర్తించారు. అలాగే గుంటూరు జిల్లాతాడేపల్లిలో ఎ్‌ఫసీఐ నిర్వహిస్తున్న వేబ్రిడ్జిలో కూడా భారీ తేడా ఉన్నట్లు గుర్తించారు. కర్నూలుజిల్లా ఎమ్మిగనూరు, కృష్ణాలో ఉయ్యూరు, నూజివీడు, ప్రకాశంలో బుచ్చిరెడ్డిపాలెం, తూర్పుగోదావరిలో వేలంగి, దివిలి, అనంతపురంలో గుత్తి, చిత్తూరులో పుత్తూరు, గుంటూరులో మంగళగిరి, విశాఖలో అనకాపల్లి, చోడవరం, మర్రిపాలెం, పశ్చిమలో తణుకు ప్రాంతాల్లో ఈ దాడులు నిర్వహించారు.
