పూజ చేస్తూ.....కుప్పకూలిన అర్చకుడు, ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి

పంచారామ క్షేత్రమైన పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సోమేశ్వర స్వామి ఆలయ గర్భగుడిలో ఓ అర్చకుడు పూజ చేస్తూనే శివలింగంపై ఒరిగిపోయారు. ఆ తర్వాత.. ఆయనను బయటికి తీసుకొచ్చిన కొద్దిసేపటికే ప్రాణం విడిచారు. ఈ నెల 11న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. అర్చకుడు కందుకూ రి రామారావు పూజ సమయం లోగర్భగుడిలో శివలింగం పక్కన పడిపోయారు. పక్కనే ఉన్న మ రో అర్చకుడు ఆయనను లేవదీశారు. కాసేపటికే రామారావు శివలింగం పానవట్టంపై పడిపోయారు. వెంటనే తోటి అర్చకులు ఆయనను బయటకు తీసుకొచ్చి సపర్యలుచేసి వైద్యం నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయారు. దాదాపు 40 ఏళ్లు సోమేశ్వరుని సేవలో తరించిన రామారావు హఠాన్మరణంపై ఆలయవర్గాలు దిగ్ర్భాంతి చెందాయి. ఇదిలా ఉంటే.. ఈ ఘటనపై సామాజిక మాధ్యమాల్లో రకరకాలు ఊహాగానాలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేవస్థానం చైర్మన్ వేగేశ్న రంగరాజు శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. కొందరు ఆలయ ప్రతిష్ఠ దెబ్బతినే విధంగా అర్చకుడు గర్భగుడిలో మృతి చెందినట్లు సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేయడం దారుణమన్నారు. ఎవరికైనా అనుమానాలుంటే ఆలయంలో సీసీ ఫుటేజీలను పరిశీలించుకోవచ్చని సూచించారు.
