ఈ నెల 5న విశాఖకి సిఎం రాక

ధర్మసాగరం (నర్సీపట్నం గ్రామీణం): ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ నెల 5న నర్సీపట్నం మండలం ధర్మసాగరం పర్యటన ఖరారు కావడంతో ఒక్కసారిగా సందడి మొదలైంది. జిల్లా అధికారులంతా సభ ఏర్పాట్లలో మునిగిపోయారు. మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు సాయంత్రం ఈ గ్రామాన్ని సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. సి.ఎం. హెలిపాడ్ దిగిన దగ్గర నుంచి స్టాల్స్ ప్రదర్శన, గ్రామసభకు ఎంపిక చేసిన రావిచెట్టు ప్రదేశం, బహిరంగ సభ స్థలం తదితరాలను పరిశీలించి డి.ఆర్.డి.ఎ. పి.డి. సత్యసాయి శ్రీనివాస్‌కు సూచనలు చేశారు. వినూత్నంగా ఊరి మధ్యలోని రచ్చబండ వంటి రావిచెట్టు చప్టా వద్ద గ్రామసభ నిర్వహిస్తుండడంతో ఈ చెట్టును కొత్తగా చూపాలని మంత్రి సూచించారు . చెట్టు మొదట జన్మభూమి లోగో అమర్చాలన్నారు. ముఖ్యమంత్రి రోడ్డు నుంచి నడుచుకుంటూ స్టాల్స్ సందర్శించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. గ్రామసభ వద్ద వెయ్యి మంది కూర్చునేలా కుర్చీలు వేస్తున్నట్టు పీడీ సత్యసాయి శ్రీనివాస్ తెలిపారు. ఈ పరిశీలనలో ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్న మంత్రి సతీమణి పద్మావతి, మండలాధ్యక్షురాలు సుకల రమణమ్మ, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ సీఎస్‌ఎన్ మూర్తి, డ్వామా పీడీ కళ్యాణ చక్రవర్తి, డీఎల్‌పీఓ శిరీష తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి ఆర్డీఓ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించి సీఎం పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.
పెదబొడ్డేపల్లి కూడలి నుంచి ధర్మసాగరం వరకు అవసరమైన చోట రోడ్డు మరమ్మతులు చేపట్టారు. విద్యుత్తు లైన్లు, వీధిదీపాలు సరిచేస్తున్నారు. ఊరంతా శుభ్రం చేయిస్తున్నారు. పోలీసు బలగాలు ధర్మసాగరం చేరుకుంటున్నాయి. హెలిపాడ్ వద్ద ఇప్పటికే బందోబస్తు ఏర్పాటు చేశారు.
సీఎం పర్యటన నేపథ్యంలో కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ బుధవారం ధర్మసాగరం గ్రామాన్ని సందర్శించారు. వివిధ ప్రదేశాలు పరిశీలించిన అనంతరం గ్రామసభను గ్రామ మధ్యలో నిర్వహించాలని, బహిరంగసభ ఊరి శివారులో గల పొలాల్లో నిర్వహించాలని నిర్ణయించారు. గ్రామసభ తలపెట్టిన రావిచెట్టు ప్రాంతం గ్రామీణ నేపథ్యాన్ని తలపిస్తూ ఆహ్లాదకర వాతావరణంలో ఉండడంతో ఈ చెట్టుకింద చప్టా మీదనే ముఖ్యమంత్రి కూర్చుని సభ నిర్వహిందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని పంచాయతీరాజ్ అధికారులకు కలెక్టర్ సూచించారు. ముగ్గులు, ఆటల పోటీలు నిర్వహించి విజేతలను ఎంపిక చేసి సిద్ధంగా ఉంచితే ముఖ్యమంత్రి చేతుల మీదుగా బహుమతులు ఇప్పిద్దామని కలెక్టర్ పేర్కొన్నారు. పిల్లల నృత్యాలు, పౌష్టికాహార స్టాళ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. డి.ఆర్.డి.ఎ. పి.డి. సత్యసాయి శ్రీనివాస్ ఉదయాన్నే గ్రామం చేరుకుని అధికారులతో కలిసి వివిధ ప్రదేశాలు పరిశీలించారు. కలెక్టర్ రాగానే ఎక్కడే కార్యక్రమం అనుకూలమో, పండగ వాతావరణం కనిపించేలా చేపట్టే ఏర్పాట్లు వివరించారు.
ఎస్.పి. రాహుల్‌దేవ్ శర్మ, ఎ.ఎస్.పి. ఆరీఫ్ హఫీజ్, ఇంటిలిజెన్స్ డి.ఎస్.పి. శ్రీనివాసరావు, స్పెషల్ బ్రాంచి డి.ఎస్.పి. యాళ్ల వెంకటరమణ, సి.ఐ. రేవతమ్మ తదితరులు బందోబస్తు ఏర్పాట్లపై చర్చించారు. సీఎంతో పాటు గ్రామసభలో మంత్రులు, గ్రామాన్ని దత్తత తీసుకున్న మంత్రి అయ్యన్న సతీమణి పద్మావతి, మండలాధ్యక్షురాలు సుకల రమణమ్మ మాట్లాడుతారు. సి.ఎం.తో ముఖాముఖిగా మాట్లాడేందుకు ఐదారుగురుని అందుబాటులో ఉంచుతారు. ఉపకారవేతనాలు, వడ్డీలేని రుణాలు ముఖ్యమంత్రి చేతులమీదుగా పంపిణీ చేస్తారు.
