పవన్ యాత్రకు విరామం రంజాన్ తర్వాత తిరిగి కొనసాగింపు

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రజా పోరాట యాత్రకు కొద్దిరోజులు విరామం ప్రకటించారు. వ్యక్తిగత సిబ్బందిలో ఎక్కువమంది ముస్లింలు ఉండటంతో రంజాన్ పండుగను దృష్టిలో ఉంచుకొని ఈ విరామం ఇచ్చారు. రంజాన్ అనంతరం యాత్ర విశాఖ జిల్లాలో యథావిధిగా కొనసాగనుంది. శుక్రవారం రాత్రి ఎలమంచిలి సభను ముగించుకుని విశాఖపట్నం చేరుకున్న పవన్ భీమిలి బీచ్‌రోడ్డులోని సాయిప్రియ రిసార్ట్‌లో బస చేశారు. శనివారం ఉదయం విశాఖకు చెందిన కొంతమంది మేధావులతో ఆయన సమావేశమయ్యారు. మాజీ వైస్ చాన్సలర్ కేఎస్ చలం తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అలాగే, ఉత్తరాంధ్ర వెనుకబాటుతనంపై ఆది, సోమవారాలలో వివిధ వర్గాలవారితో పవన్ చర్చించనున్నారని జనసేన మీడియా హెడ్ పి.హరిప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. జనసైనికులకు ఉత్తరాంధ్ర వెనుకబాటుతనంపై అవగాహన కల్పించేందుకు ఒక ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్టు వివరించారు. సోమవారం సాయంత్రం పవన్ విశాఖ నుంచి హైదరాబాద్ బయలుదేరుతారు.
