పైకేమో మామిడి పండ్లు.. లోపల చూస్తే...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి హైదరాబాద్‌కు గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్న గంజాయిని బీబీనగర్ పోలీసులు బుధవారం నాటకీయ ప్రక్రియలో పట్టుకున్నారు. రూ.30లక్షల విలువ చేసే 300 క్వింటాళ్ల గంజాయి బ్యాగులను స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. విశాఖపట్టణం నుంచి ఏపీ 31టీకే 1693 నెంబర్ గల ట్రాలీ ఆటోలో మామిడి పండ్లు నింపి వాటి మధ్యలో గంజాయి బస్తాలను ఉంచి ఎవరికి అనుమానం రాకుండా హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. మామిడి పండ్లతో పాటు హైదరాబాద్‌కు గంజాయిని తరలిస్తున్నట్టు పోలీసులకు ముందుగానే సమాచారం రావడంతో బీబీనగర్ పోలీసులు గూడూరు టోల్‌ప్లాజా వద్ద నిఘా ఉంచారు. బుధవారం సాయంత్రం గూడూరు టోల్‌ప్లాజా వద్ద నిఘా పెట్టిన పోలీసులకు ఆటోలో మామిడిపండ్లలోడ్ గల ఆటోను గుర్తించి పట్టుకున్నారు. ఆటో డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని బీబీనగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆటోలో ఉన్న మామిడిపండ్లను తొలగించి వాటి మధ్య దాచి ఉంచిన గంజాయి బస్తాలను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు విచారిస్తున్నారు. బీబీనగర్ పోలీసులు తహసీల్దార్ అశోక్‌రెడ్డి సమక్షంలో పంచనామా నిర్వహించి గంజాయి బస్తాల వాహనాన్ని సీజ్ చేశారు. కాగా గంజాయి ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు. తరలింపు వెనుక బాధ్యులెవరో గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. గంజాయి అక్రమ తరలింపు వెనుక పూర్తి వివరాలను రాబట్టి మీడియాకు వివరించనున్నట్టు సమాచారం.
