గ్రామం నుంచి పాలిథిన్ భూతాన్ని తరిమికొట్టేందుకు..

సంకల్పముంటే సాధ్యంకానిదంటూ ఉండదంటారు. దీనిని నిజం చేశారు మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌కు చెందిన హట్టా నివాసి శీలా పటేల్(54). శీలా రెండు సంవత్సరాల క్రితం రేడియోలో పాలిథిన్ బ్యాగుల వలన పర్యావరణానికి ఏర్పడుతున్న హాని గురించి విన్నారు. దీంతో గ్రామం నుంచి పాలిథిన్ భూతాన్ని తరిమికొట్టాలనుకున్నారు. ముందుగా ఆమె ఈ పనిని తన ఇంటి నుంచే ప్రారంభించారు. 10 వేల జనాభా ఉన్న గ్రామంలో పాలిథిన్ వలన కలిగే హాని గురించి అందరికీ అవగాహన కల్పించారు. ఈ నేపధ్యంలో మొత్తం 1100 గుడ్డ సంచులను తయారుచేసి, ఉచితంగా పంపిణీ చేశారు. దీంతో గ్రామంలోని వారంతా పాలిథిన్ కవర్ల వినియోగానికి స్వస్తిపలికి, ఈ గుడ్డ సంచులను వినియోగించసాగారు. దీనికి తోడు వారంతా శీలా పటేల్ మరిన్ని సంచులు తయారు చేసేందుకు సాయమందిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణకు శీలా చేస్తున్న కృషిని చూసి అధికారులు అభినందిస్తున్నారు.
