చిదంబరం కేసులో జగన్ ప్రస్తావన
Published: Sunday August 25, 2019

కాంగ్రెస్ దిగ్గజం, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం అరెస్ట్ కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రస్తావన చోటు చేసుకుంది. అరెస్ట్ కాకుండా చిదంబరానికి రక్షణ కల్పిస్తూ ఇచ్చిన బెయిల్‌ను ఎత్తేస్తూ ఇచ్చిన తీర్పులో ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ సునీల్ గౌర్ జగన్ కేసును ఉటంకించారు. జగన్ కేసు విచారణ సమయంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించి.. చిదంబరమూ ఆ కోవకే వస్తారని పరోక్షంగా వ్యాఖ్యానించారు. తీర్పులోని 20, 22 పేజీల్లో జగన్ పేరును ఆయన నిర్దిష్టంగా పేర్కొన్నారు. ‘‘ఆర్థిక నేరాలు మిగిలిన వాటి కంటే పూర్తిగా భిన్నమైనవి. వాటిని మిగిలిన కేసులతో పోల్చలేం. అందుచేత బెయిల్ ఇచ్చేముందు విభిన్నంగా ఆలోచించాలి. భారీ కుట్ర ద్వారా పెద్ద ఎత్తున ప్రజాధనానికి నష్టం వాటిల్లేట్లు చేసే కేసులను సీరియస్‌గా పరిగణించాలి. అలాంటి ఆర్థిక నేరాలు దేశ ఆర్థిక వ్యవస్థకే చేటు. దేశ ఆర్థికాన్ని దెబ్బతీసే చర్యలను తేలిగ్గా తీసుకోరాదు..’’ అని జస్టిస్ గౌర్ తన తీర్పులో స్పష్టం చేశారు.
‘‘వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి సంబంధించిన కేసులో అనేకమంది కుట్రదారుల లావాదేవీలపై బహుళ రీతుల్లో జరిపిన దర్యాప్తును పరిశీలించిన మీదట సుప్రీంకోర్టు కొన్ని కీలకవ్యాఖ్యలు చేసింది. భారీ పరిమాణంలో ప్రజాధనం కైంకర్యమైన నేరపూరిత కుట్రల్లో బెయిల్ పిటిషన్లపై కఠినంగా వ్యవహరించాలి. భారీ స్థాయిలో ఆర్థిక నేరాలకు పాల్పడేవారు ఎంతో నేర్పుగా ముందస్తు ప్రణాళిక వేసుకుని అమలు చేస్తారు. మోసపూరిత ఆర్థిక లావాదేవీలు దేశ ఆర్థికానికి చేటు. ఆ వ్యాఖ్యలను బట్టి చూస్తే ప్రస్తుత కేసులో (చిదంబరం) బెయిలు కొనసాగించడం వల్ల సమాజానికి తప్పుడు సంకేతాలను పంపినట్లవుతుంది’’ అని జస్టిస్ గౌర్ అభిప్రాయపడ్డారు.
