పోలవరం సాగునీటి ప్రాజెక్టు, జల విద్యుత్కేంద్రానికి ఒకే టెండర్

పోలవరం సాగునీటి ప్రాజెక్టు, జల విద్యుత్కేంద్రాన్నీ కలిపి ఒకే యూనిట్‌గా శనివారం (17న) రాష్ట్రప్రభుత్వం రివర్స్ టెండర్ పిలవనుంది. విద్యుత్కేంద్రానికి రూ.3,220.22 కోట్లు.. సాగునీటి ప్రాజెక్టులో మిగిలిపోయిన కాంక్రీట్ పనులు, గేట్ల తయారీ, బిగింపు పనులకు కలిపి రూ.1850 కోట్లు.. మొత్తంగా రూ.5,070.22 కోట్లకు టెండర్లు పిలుస్తోంది. ఈనెల 13న హైదరాబాద్‌లో జరిగిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సమావేశంలో రివర్స్ టెండరింగ్‌కు వెళ్లడం వల్ల అంచనా వ్యయాలు పెరుగుతాయని, లక్ష్యాన్ని చేధించడంలో జాప్యం జరుగుతుందని, ముఖ్యంగా డ్యాం భద్రతకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించింది. వీటిన్నిటినీ దృష్టిలో ఉంచుకుని రివర్స్ టెండర్ ఆలోచనపై పునఃసమీక్షించుకోవాలని పీపీఏ సీఈవో ఆర్‌కే జైన్ సూచించారు. ఇది రాష్ట్రప్రభుత్వ అధీనంలోనిదే అయినప్పటికీ.. 70శాతం పనులు పూర్తయ్యాక.. మిగిలిన 30 శాతం పనుల కోసం టెండర్లను పిలిచేందుకు ఇది సరైన సమయమేనా అని పీపీఏ ప్రశ్నించింది. సమావేశం ‘మినిట్స్’ను ఇంకా పీపీఏ సిద్ధం చేయలేదు. ఈ మినిట్స్ వచ్చాకే పోలవరం టెండర్ల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అంతా భావించారు. కానీ వెంటనే నిర్ణయం తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించడంతో.. జల వనరులశాఖ, ఏపీ జెన్‌కో అధికారులు దూకుడు పెంచారు. ఇప్పటికే సాగునీటి ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు చేపడుతున్న నవయుగ ఇంజనీరింగ్, బెకమ్ సంస్థలకు ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ సుధాకర్‌బాబు ప్రీక్లోజర్ నోటీసు జారీచేశారు. ఈ నోటీసులకు ఆ సంస్థల నుం చి సమాధానాలు వచ్చాయి. తా ము గతంలో చేసేందుకు అంగీకరించిన రూ.387.56 కోట్లలో 5 శాతం డిస్కౌంట్ ఇచ్చి రూ.368.19 కోట్లకు గేట్ల తయా రీ, బిగింపు పనులు చేపట్టేందుకు సిద్ధమేనని బెకమ్ వెల్లడించింది. పోలవరం సాగునీటి పనుల్లో మిగిలిన పనుల ధరలనే ఇంటర్నల్ బెంచ్ మార్క్ (ఐబీఎం)గా తీసుకున్నారు. విద్యుత్ ప్రాజెక్టుకూ గతంలో పిలిచిన టెండర్ ధరనే ఐబీఎంగా తీసుకుని బిడ్‌లను పిలుస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టు, విద్యుత్కేంద్రాలకు ఒకే ప్యాకేజీ కింద రివర్స్ టెండర్‌కు వెళ్తున్నామంటూ పీపీఏకి జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ లేఖ రాశారు. సంబంధిత పత్రాలన్నీ సిద్ధమైతే శుక్రవారమే టెండర్లు పిలిచే అవకాశాలున్నాయని జలవనరులశాఖ వర్గాలు తెలిపాయి. కాగా.. ఇతర శాఖలు కూడా రివర్స్ టెండరింగ్‌లో బిడ్లు పిలిచేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే జల వనరుల శాఖ కేపీఎంజీ కన్సల్టెన్సీ సంస్థ ద్వారా రివర్స్ టెండర్ డాక్యుమెంట్లను సిద్ధం చేయించింది.
