విషతుల్యంగా మారిన దాణా
Published: Sunday August 11, 2019

విజయవాడ ఇంద్రకీలాద్రిసమీపంలో కొందరు మార్వాడీలు గోసంరక్షణ సంఘాన్ని ఏర్పాటు చేసి ఆవులను సంరక్షిస్తున్నారు. ఈ ఆవరణ సరిపోకపోవడంతో కొత్తూరు తాడేపల్లిలో ఏడు ఎకరాల స్థలంలో మరో గోశాల ఏర్పాటు చేశారు. ఇక్కడ పది షెడ్లు, మూడు బ్యారక్‌ల్లో సుమారు 1500 ఆవులు ఉన్నాయి. కమిటీ సభ్యులు కొన్నాళ్ల కిందటిదాకా విజయవాడలో దాణాను కొనుగోలు చేసేవారు. ఇప్పుడు ప్రకాశం జిల్లా అద్దంకి నుంచి దాణా (ముక్కలుగా నరికిన పచ్చిగడ్డి) తెప్పించుకుంటున్నారు. శుక్రవారం అద్దంకి నుంచి 7,425 కిలోలు... విజయవాడ చుట్టుపక్కల నుంచి నాలుగు విడతలుగా 5,610 కిలోల పచ్చిమేత వచ్చింది. కార్మికులు శుక్రవారం రాత్రి దీనిని గోవులకు ఆహారంగా వేశారు. రాత్రి 9.30 గంటల నుంచి ఆవులు నిలబడిన చోటే పడిపోసాగాయి. నోరు, ముక్కు నుంచి నురగలు వచ్చాయి. రాత్రి 10 గంటల సమయానికి ఒక ఆవు చనిపోయింది. అప్పటి నుంచి ఒక్కో గంట గడిచేకొద్దీ మృత్యుఘోష మరింత పెరిగింది. కమిటీ సభ్యులు అప్పటికప్పుడు పశు సంవర్ధక శాఖ వైద్యులకు సమాచారం ఇచ్చారు. గోశాలలో సుమారు 1500 ఆవులు ఉండగా... 128 ఆవులు మాత్రం అస్వస్థతకు గురయ్యాయి.
రసాయన గుళికలు వేసి పెంచిన మేత విషపూరితం (టాక్సిక్) కావడంవల్లే ఆవులు మరణించాయని ప్రాథమికంగా నిర్ధారించారు. 30కి పైగా ఆవులకు పోస్టుమార్టం చేయగా... వాటన్నింటి కడుపులో పచ్చగడ్డి ఉంది. వాటి ఊపిరితిత్తులు, పేగులపై ‘పెటికల్ హ్యామరేజ్’ (నరాలు చిట్లి రక్తస్రావం జరగడం) ఛాయలు కనిపించాయి. టాక్సిసిటీ వల్లే ఇలా జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. శుక్రవారం గోశాలకు అద్దంకితోపాటు విజయవాడ పరిసరాల నుంచి నాలుగు లోడ్‌ల మేత వచ్చింది. వీటిలో ఏ మేత వల్ల ఈ ఘోరం జరిగిందో గుర్తించాల్సి ఉంది.
శ్రావణ మాసం... శుక్రవారం... ఉదయం నుంచి సాయంత్రం దాకా భక్తులు ఎందరో వచ్చారు. పండ్లూ ఫలాలూ ఇచ్చారు! చీకటి కాగానే... నిర్వాహకులు కూడా ఎప్పట్లాగానే పచ్చి గడ్డిని మేతగా వేశారు. ఆకలిగొన్న ఆవులు ఇష్టంగా తిన్నాయి. కానీ, కడుపు నింపాల్సిన మేతే వాటి ప్రాణం తీసింది. రసాయన గుళికల ప్రభావంతో ఏపుగా పెరిగిన పచ్చగడ్డి... విషతుల్యంగా మారింది. ఆ మేత తిన్న ఆవులు ఒక్కొక్కటిగా ఉన్నచోటే కుప్పకూలిపోయాయి. నురగలు కక్కాయి. గుడ్లు తేలేశాయి. ప్రాణాలు వదిలాయి. ఇలా ఒకటీ రెండూ కాదు... 86 ఆవులు చనిపోయాయి. విజయవాడ శివార్లలోని కొత్తూరు తాడేపల్లిలోని గోశాలలో జరిగిన ఘోరమిది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం దాకా ఈ గోశాలలో మృత్యుఘోష కొనసాగుతూనే ఉంది.
చనిపోయిన ఆవులకు గోశాల ప్రాంగణంలోనే పోస్టుమార్టం నిర్వహించారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణకు కలెక్టర్ ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఆవులకు వేసిన దాణా నమూనాలను పరీక్షలకు తరలించారు. గోవులకు ఇస్తున్న నీటిని, చుట్టుపక్కల ఉన్న నీటి నమూనాలను గ్రామీణ నీటిసరఫరా శాఖ అధికారులు సేకరించారు. మృతి చెందిన గోవులను గోశాల ప్రాంగణంలోనే ఖననం చేశారు. ఘటనా స్థలాన్ని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, కలెక్టర్ ఇంతియాజ్, జాయింట్ కలెక్టర్ మాధవీలత, సబ్‌కలెక్టర్ మిషాసింగ్ పరిశీలించారు. పూర్తిస్థాయి నివేదిక వచ్చిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని విజయవాడ పోలీసు కమిషనర్ సీహెచ్ ద్వారకా తిరుమలరావు చెప్పారు.
ఈ ఘటనపై హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని అరుణాచలం అన్నపూర్ణ ఆశ్రమ పీఠాధిపతి శివానంద లహరి స్వామి డిమాండ్ చేశారు. విజయవాడ గోశాలల్లో ఇలా ఆవులు చనిపోవడం ఇది మూడోసారి. గత ఏడాది గన్నవరం సమీపాన ఉన్న కొండపావులూరులో 13 ఆవులు సరైన పోషణ లేక చనిపోయాయి. 2013లో ఇంద్రకీలాద్రి వద్ద గోశాలలో పాడైపోయిన రవ్వను ఆహారంగా తిని 20 ఆవులు మృత్యువాత పడ్డాయి.
