పోలవరం కాఫర్ డ్యామ్ వద్ద‘రెస్క్యూ ఆపరేషన్’
Published: Saturday August 10, 2019

ఎగువ నుంచి వస్తున్న ప్రవాహంతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. పొట్ట కూటి కోసం గూడుపడవల్లో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు ఆ గోదావరిలోనే వేటసాగిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యామ్ వద్ద ఉధృతంగా సుడులు తిరుగుతున్న నీటిలో వీరి పడవలు చిక్కుకున్నాయి. గురువారం అర్ధరాత్రి వేళ ఎదురైన ఈ అనూహ్య పరిణామంతో ప్రాణాలు అరచేత పట్టుకుని కాఫర్ డ్యామ్‌పై రాత్రంతా జాగారం చేశారు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, నేవీ హెలికాప్టర్ రంగంలోకి దిగాయి. కేవలం రెండు గంటల్లోనే మొత్తం 32 మంది మత్స్యకారులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చడంతో పెను ప్రమాదం తప్పింది.
ఈ మొత్తం ‘రెస్క్యూ ఆపరేషన్’లో పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి కీలక పాత్ర పోషించారు. వివరాల్లోకి వెళ్తే... ధవళేశ్వరం గ్రామానికి చెందిన పలు మత్స్యకార కుటుంబాలు చేపల వేట కోసం ఏటా వరదలు తగ్గాక పాపికొండలు, విలీన మండలాల ప్రాంతాల్లో నివాసం ఏర్పాటు చేసుకుంటారు. గూడు పడవల్లోనే ఎక్కువ సమయం నివసిస్తూ ఉంటారు. కొన్ని రోజులు మాత్రం గోదావరి తిప్పలో గుడిసెలు వేసుకుని ఉంటారు. సాధారణంగా జూలై నెలలోనే వరదలు వచ్చే సమయంలో ఇంటికి తిరిగి వచ్చేస్తారు. ఈ సారి జూలై చివరి వరకూ వరదలు రాకపోవడంతో వేట కొనసాగిస్తున్నారు.
గత నెల 30వ తేదీ నుంచి వరద మొదలైంది. అయితే హెచ్చుతగ్గులు ఉండడంతో.. తగ్గిపోతుందిలే అనే ఆలోచనతో అక్కడే ఉన్నారు. కానీ గురువారం భద్రాచలం వద్ద గోదావరి ఉధృతం కావడంతో లంకల తిప్పలు కూడా మునిగిపోవడంతో అక్కడ గుడిసెలకు సైతం అవకాశం లేకుండా పోయింది. దీంతో, 32 మంది 18 పడవల్లో బయల్దేరారు. కొంతమంది గురువారం రాత్రి పాపికొండల ప్రాంతంలో ఆగిపోయారు. మరికొంతమంది కాఫర్ డ్యామ్ వద్దకు చేరుకున్నారు. అక్కడ ఉధృతి ఎక్కువగా ఉండడంతో పాటు ఎత్తు నుంచి కిందకు పడుతున్నట్టు ప్రవాహం సుడిగుండంగా ఉండడంతో పడవలు ప్రమాదంలో చిక్కుకున్నాయి. పరిస్థితిని గమనించిన మత్స్యకారులు చాకచక్యంగా కాఫర్‌డ్యామ్ పక్కకి మళ్లించారు. నెమ్మదిగా అందరూ కాఫర్‌డ్యామ్ పైకి చేరారు. అందులో 25 మంది ఉన్నారు. రాత్రంతా కాఫర్‌డ్యామ్ మీదే జాగరం చేశారు. రాత్రి పాపికొండలులో ఆగిపోయిన మిగిలిన వారు రెండు గూడు పడవలను జంటగా కట్టి బయలుదేరారు.
