ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు త్వరలో విధివిధానాలు
Published: Friday August 02, 2019

ఫీజుల వ్యవహారంపై ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌కు కౌంటర్ వేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ చెప్పారు. గురువారం గవర్నర్ పర్యటనలో పాల్గొనేందుకు ఆంధ్ర విశ్వవిద్యాలయానికి విచ్చేసిన మంత్రి కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని 300కుపైగా ఇంజనీరింగ్ కళాశాలల్లో ఫీజుల వసూళ్లలో తేడాలున్నాయన్నారు. ఫీజుల నియంత్రణకు రెండు రోజుల క్రితం తీసుకొచ్చిన చట్టం అమలు చేసేలోగా యాజమాన్యాలు తొందరపడ్డాయని వ్యాఖ్యానించారు. ఈ నెల ఐదు నుంచి ఇంజనీరింగ్ కళాశాలల్లో తరగతులు ప్రారంభమవుతాయని వెల్లడించారు.
వృత్తివిద్యా కోర్సుల్లో నూరుశాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి విధివిధానాలు త్వరలో ప్రకటిస్తామన్నారు. వర్సిటీలకు మంజూరైన నిధులను గత ప్రభుత్వం దారిమళ్లించిందని ఆరోపించారు. దీనిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 1,104 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన రాత పరీక్షలను సమీక్షిస్తామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన రాత పరీక్షకు సంబంధించి విధానాల రూపకల్పన, మూల్యాంకనం సక్రమంగా జరగలేదని, అందువల్ల వాటిని సవరించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
