వీడియో తీస్తున్నాడని చెంప చెళ్లుమనిపించిన ఎస్సై
Published: Sunday July 28, 2019

పోలీస్‌స్టేషన్‌లో జరిగే ఓ పంచాయితీని చూడడానికి వెళ్లిన ఓ వ్యక్తిని ఎస్‌ఐ బూటుకాలితో తన్నిన సంఘటన స్థానిక పోలీస్‌స్టేషన్‌లో శనివారం చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాలివి. మండలంలోని అరకటవేముల గ్రామానికి చెందిన నాగమునెయ్య తమ బంధువుల పంచాయితీ ఉండగా స్టేషన్‌కు వచ్చాడు. ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఫిర్యాదుతో ఇరువురిని స్టేషన్‌లో ఎస్‌ఐ వెంకటప్రసాద్ విచారిస్తున్నారు. అక్కడే ఉన్న నాగమునెయ్య కిటికీ వద్ద నిలబడి సెల్‌ఫోన్ చూస్తుండగా ఎస్‌ఐ గమనించి పిలిపించాడు. అక్కడ నిలబడి ఏం చేస్తున్నావ్, సెల్‌ఫోన్‌తో వీడియో తీస్తున్నావా అని ఆగ్రహించి చెంపకు రెండుసార్లు కొట్టగా, బూటుకాలితో మెడపై తన్నాడు. నాగమునెయ్యకు కొద్దిసేపు మెడలు పట్టుకోగా, వారి బంధువులు ఆందోళన చేశారు. పెద్దఎత్తున నినాదాలు చేయడంతో వివాదాస్పదమైంది. అనంతరం చేసిన తప్పుకు అక్కడే ఉన్న సీఐ దేవేంద్రకుమార్ క్షమాపణలు చెప్పడంతో శాంతించారు. దుప్పటి పంచాయితీ చేశారనే ఆరోపణలు వచ్చాయి.
నాగమునెయ్యను ఎవరూ తన్నలేదు. పంచాయితీ చేస్తుండగా కిటికీలో నుంచి చూస్తుం డడంతో ఎస్‌ఐ పిలిపించాడు. అతను మద్యం ఎక్కువ తాగడంతో మందలించామే తప్ప కొట్టలేదు. స్టేషన్‌లోకి మద్యం తాగి రాకూడదని చెప్పాం. అతను కల్పించుకొని మాట్లాడారు.
అరకటవేములకు చెందిన బాధితుడు నాగమునెయ్యను శనివారం సాయంత్రం డీఎస్పీ శ్రీనివాసులు విచారించారు. గ్రామ శివారులో ఉన్న రహదారి వద్దకు పిలిచి ఏమి జరిగింద ని అడిగి తెలుసుకున్నారు. బాధితుడు మొత్తం వివరించారు. అనవసరంగా కొట్టాడని డీఎస్పీ దగ్గర మొరపెట్టుకున్నట్లు తెలిసింది. విచారించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
