పోలీసులంటే ప్రజలకు ఎంత భరోసానో
Published: Sunday July 28, 2019

పోలీసులంటే ప్రజలకు ఎంత భరోసానో ఈ ఘటన రుజువు చేసింది. పాలకొండల్లో తేనెటీగల దాడిలో గాయపడి, కాలు విరిగి మూడుగంటలపాటు నరకయాతన అనుభవించిన ఓ విద్యార్థిని రిమ్స్ ఎస్‌ఐ ఒకటిన్నర కిలోమీటరు దూరం మోసుకొచ్చి ఆస్పత్రికి తరలించి అందరిచేతా శభాష్ అనిపించుకున్నారు. వివరాలిలా..
కడప ఇందిరానగర్‌కు చెందిన ఆదిజాల మణికంఠ సమీపంలోని హైస్కూలులో పదవ తరగతి చదువుతున్నాడు. శనివారం స్నేహితులతో కలసి పాలకొండలకు వెళ్లారు. అక్కడున్న వాటర్‌ఫాల్స్‌లో ఈత ఆడేందుకు సిద్దమయ్యారు. సమీపంలో తేనెపట్టు కనిపించడంతో వారిలో ఒకరు దానిపైకి రాయి విసిరారు. దీంతో ఒక్కసారిగా పెద్ద తేనెటీగలన్నీ విద్యార్థులను చుట్టుముట్టాయి. ముగ్గురు అక్కడ నుంచి తప్పించుకున్నారు. మణికంఠ మాత్రం తేనెటీగలు కుట్టిన బాధ తట్టుకోలేక చిన్నలోయలో పడిపోవడంతో కాలు విరిగింది.
తేనెటీగల దాడిలో తీవ్రంగా గాయపడి లోయలో పడ్డ మణికంఠ మూడుగంటల పాటు నరకయాతన అనుభవించాడు. స్నేహితులు కిందికి వచ్చి గట్టిగా అరుస్తూ ఏడుస్తుండడంతో అక్కడున్న కొంత మంది విషయం తెలసుకుని రిమ్స్ పోలీసులకు సమాచారం అందించారు.
మణికంఠ తేనెటీగల దాడిలో గాయపడ్డ విషయం తెలిసిన వెంటనే రిమ్స్ సీఐ సత్యబాబు ఆదేశాల మేరకు ఎస్‌ఐ విద్యాసాగర్ సిబ్బందితో సంఘాటన స్థలానికి చేరుకున్నారు. అప్పటి వరకు తేనెటీగలు మణికంఠను కుడుతూనే ఉన్నాయి. వీరు తీసుకెళ్లిన దుప్పట్ల సహాయంతో అతికష్టం మీద మణికంఠను రక్షించారు. కొండపై నుంచి కిందకు దాదాపు ఒకటిన్నర కిలోమీటరు వరకు ఎస్‌ఐ విద్యాసాగర్ విద్యార్థిని భుజాన వేసుకుని వచ్చారు. ఆపై 108 ద్వారా చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. ఎస్‌ఐ సాహసాన్ని శభాష్ అంటూ పలువురు ప్రశంసించారు. అయితే మణికంఠను రక్షించే సమయంలో ఎస్‌ఐ, కానిస్టేబుళ్లు తేనెటీగల దాడిలో స్వల్పంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని కడప డీఎస్పీ సూర్యనారాయణ, ఎస్పీ అభిషేక్ మహంతి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన ఎస్‌ఐని అభినందించారు.
