కియ, అనుబంధ సంస్థల్లో ఉద్యోగాలేవీ..?
Published: Saturday July 27, 2019

భూములిస్తే పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పరిశ్రమలు జిల్లాకు క్యూకడుతున్నాయి. భూములు తీసుకున్న సమయంలో పరిశ్రమల యాజమాన్యాలు ఎంఓయులో స్థానికులకే ఉద్యోగాలు ఇస్తామని చెబుతున్నా నిర్మాణం అనంతరం దాటివేస్తూ స్థానికేతరులకే ప్రాధాన్యమిస్తున్నాయి. ఇందుకు నాటి తూమకుంట పారిశ్రామివాడ నుంచి ఇటీవల జిల్లాకు వరంగా భావించే దక్షిణ కొరియా కార్ల దిగ్గజం కియ కార్ల పరిశ్రమ, అనుబంధ సంస్థల వరకు అదే తంతుసాగుతోంది. ఈ నేపథ్యంలో పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయని ఆశలు పెట్టుకున్న యువతకు నిరాశే మిగులుతోంది. కియ నిర్మాణంతో తమకు అవకాశం ఎప్పుడొస్తుందని భూములు ఇచ్చిన రైతు కుటుంబాలతోపాటు జిల్లాలో వేలాది మంది నిరుద్యోగ యువత ఎదురుచూస్తోంది. రెండేళ్లగా డిగ్రీ, పాలిటెక్నిక్, డిప్లొమా, ఇంజనీరింగ్, చదివి నైపుణ్యం కలిగిన యువత కియ అనుబంధ సంస్థల్లో ఉద్యోగం కోసం ఎదురుచూస్తోంది. ఇటీవల స్థానికేతురులకు ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో జిల్లాలోని నిరుద్యోగుల పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది.
కియతోపాటు అనుబంధ సంస్థల్లో ఉద్యోగ అవకాశాల కోసం నిరుద్యోగ యువత ఎన్నో ఆశలు పెట్టుకుంది. కియలో నియామకాల కోసం 5400 మంది డిప్లొమా, పాలిటెక్నికల్ అభ్యర్థులు ఏపీ నైపుణ్యాభివృద్ది సంస్థకు 2018లోనే దరఖాస్తు చేసుకున్నారు. అర్హత పరీక్షల్లో ప్రతిభ సాధించిన అభ్యర్థుల్లో ఇప్పటి వరకు 1540 మందికి శిక్షణ ఇచ్చారు. అదే విధంగా అనంతపురం జేఎన్‌టీయూలో అర్హత పరీక్షల్లో ప్రతిభ కనపరిచిన డిప్లొమా అభ్యర్థులకు శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటి వరకు శిక్షణలో నైపుణ్యత కనబరచిన 620 అభ్యర్థులను కియలో వివిధ విభాగాల్లో తీసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న మిగిలిన వారి పరిస్థితి ఏమైందో చెప్పేనాథుడే కనిపించడంలేదని దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులు ఆవేదన చెందుతున్నారు. రూ. 13 వేల కోట్లతో దశల వారిగా నిర్మాణం చేపట్టి ప్రత్యక్ష పరోక్షంగా 11వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తామని ప్రభుత్వం ఒప్పుందంలో కియ స్పష్టం చేసింది. అదే విధంగా కియ అనుబంధ సంస్థలు రూ.3500 కోట్ల నిర్మాణంతో 7500 మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పారు. ఇందులోను 90 శాతం స్థానికులకే ఇస్తున్నట్లు పలు మార్లు కియ ప్రతినిధులు చెప్పారు. అనుబంధ సంస్థలు కాంట్రాక్టు ఏజెన్సీలతో ఉద్యోగ నియామకాలు చేపడుతున్నాయి. జిల్లా వాసులకు ఎంత మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయనేది జిల్లా యంత్రాంగానికే తెలియని పరిస్థతి నెలకొంది. పరిశ్రమల కోసం భూముల ఇచ్చిన రైతు కుటుంబాల్లో వారికి ఉద్యోగం కల్పిస్తామని హడావిడి చేసిన యంత్రాంగం ఎంత మందికి ఇస్తారన్న స్పష్టత ఇవ్వలేదు. కియ అనుబంధ 18 సంస్థల్లో కాంట్రాక్టు పద్దతిన ఏజెన్సీల ద్వారా తక్కువ వేతనాలతో నియమాకాలు చేపట్టినట్లు తెలుస్తోంది.
