ప్లేట్ల ట్యాంపరింగ్.. నిబంధనల ఉల్లంఘన
Published: Friday July 26, 2019

ఒక ఆటో డ్రైవర్ ఐటీ కారిడార్‌లోని ట్రాఫిక్ సిగ్నల్ సమీపానికి రాగానే తన ఆటోను పక్కకు ఆపాడు. వెనుక నంబర్ కనిపించకుండా నంబర్ ప్లేట్‌ను ఒకవైపు వంపాడు. సిగ్నల్ దాటిన తర్వాత తిరిగి నంబర్ ప్లేట్‌ను సరిచేసుకున్నాడు. కొంతదూరం వెళ్లిన తర్వాత మరో సిగ్నల్ వద్దకు రాగానే మళ్లీ అదే పని చేశాడు. రోజూ ఇదే రీతిన సిగ్నల్ జంపింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్ వంటి ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నాడు. పోలీసులకు నంబర్ ప్లేట్ కనిపించకుండా జాగ్రత్త పడుతూ చలానాలు తప్పించుకుంటున్నాడు. ఆటోడ్రైవర్ అతితెలివిని సీసీటీవీ కెమెరాల్లో గుర్తించిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అతన్ని పట్టుకున్నారు. అతనిపై ట్రాఫిక్ ఉల్లంఘన కేసులతోపాటు, ఉద్ధేశ్యపూర్వకంగానే తప్పు చేశాడని నిర్ధారించి క్రిమినల్ కేసు నమోదు చేశారు.
ఈ-చలానాల రూపంలో పోలీసులు విధిస్తున్న జరిమానాల నుంచి తప్పించుకోవడానికి కొంతమంది వాహనదారులు నంబ ర్ ప్లేట్ ట్యాంపరింగ్‌కు పాల్పడుతున్నారు. దీన్ని సీరియ్‌సగా తీసుకున్న సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. కమిషనరేట్ పరిఽధిలోని అన్ని ప్రాంతాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. కేవలం 4 రోజుల్లో 2500 కేసులు నమోదయ్యాయి.
కొందరు ద్విచక్ర వాహనదారులు, ఆటోవాలాలు, కారు యజమానులు వాహనానికి పూజలు చేయించి, బండికి పూలదండ వేస్తున్నారు. ఈ క్రమంలో బండిపై ఉన్న నంబర్ ప్లేట్ కనిపించకుండా పూలదండతో కప్పేస్తున్నారు. మరికొందరు నంబర్ ప్లేట్‌లోని అక్షరమో, నంబరో తొలగిస్తున్నారు. ఇంకొందరు ఒక అక్షరం స్థానంలో మరో అక్షరాన్ని, ఒక అంకెకు బదులు మరో అంకెను చేర్చుతున్నారు. దాంతో వాహన యజయాని అడ్రస్ తెలియకపోవడం లేదా మరో వాహన యజమానికి తప్పుగా ఈ-చలానా వెళ్లడం వంటి జరుగుతున్నాయి. కొత్తగా వాహనం కొనుగోలు చేసినవారు షోరూం వాళ్లు ఇచ్చిన నంబర్ రాయకుండా టీఆర్ స్టిక్కర్‌తో రోడ్డుపై తిరుగుతున్నారు. కొందరు కేటుగాళ్లు వాహనానికి ఉన్న అసలు నంబర్‌ను పక్కకు పడేసి, ఏదొక నంబర్ క్రియేట్ చేసి నంబర్ ప్లేట్ తగిలిస్తున్నారు. దాంతో ఎన్నిసార్లు ట్రాపిక్ ఉల్లంఘనలకు పాల్పడినా ఈ చలానా జనరేట్ అవడం లేదు. ఇంకొందరు నంబర్ ప్లేట్‌ను సగానికి విరగొట్టడం, గ్రీజు రాయడం, రంగు పూయడం వంటివి చేస్తున్నారు.
