రవాణాశాఖలో అవినీతిని తగ్గించాలి
Published: Monday July 22, 2019

రవాణాశాఖలో పనిచేసే అధికారులు డబ్బుకోసం జనం వెంటపడొద్దని రవాణాశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) అన్నారు. ఆదివారం కృష్ణాజిల్లా మచిలీపట్నంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ‘రహదారి భద్రత- అవగాహన’ సదస్సులో ఆయన మాట్లాడుతూ రవాణాశాఖ అంటేనే అవినీతి అనే నానుడి ఉందన్నారు. కొందరు ఉద్యోగుల పనితీరు కారణంగా అవినీతి అనే మూర్ఛబిళ్లను శాఖకు కట్టారన్నారు. ప్రస్తుతం కూలీనాలీ చేసుకునేవారు కూడా భార్య, పిల్లలతో ద్విచక్రవాహనంపై వెళ్తున్నారని, అప్పుచేసి కొనుగోలు చేసిన వారివద్ద బండికి సంబంధించిన ఆధారాలు అప్పటికప్పుడు ఉండవని, అలాంటి వారిని వదిలిపెట్టాలని సూచించారు. ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టేలా తప్పుడు పత్రాలు సృష్టిస్తున్న వాహనాలు విక్రయించే డీలర్ల పని పట్టాలన్నారు. ప్రజల కంటే సరుకు రవాణాకే ప్రాధాన్యం ఇచ్చే ప్రైవే టు అద్దె బస్సులపై దృష్టి సారించాలన్నారు. రానున్న ఐదేళ్లలో రవాణాశాఖలో అవినీతి తగ్గిందనే పేరు తీసుకురావాలని, ముఖ్యమంత్రి వద్ద తాను ఈ శాఖ మంత్రిగా కాలర్ ఎత్తుకునేలా చేయాలని నాని కోరారు. రవాణాశాఖ ద్వారా ప్రభుత్వానికి ఈ ఏడాది రూ.4వేల కోట్ల ఆదాయం సమకూర్చాల్సి ఉందన్నారు. శాఖలో ఉద్యోగుల సమస్యలు పరిస్కరించేందుకు ప్రతినెలా మూడో శుక్రవారం గ్రీవెన్స్‌ను నిర్వహిస్తామన్నారు.
రవాణాశాఖ అధికారులంతా విధిగా డ్రెస్‌కోడ్ పాటించాలని, డ్రెస్‌లోనే మీరు అందంగా ఉంటారని మంత్రి చమత్కరించారు. రోడ్డు భద్రతపై కనీస అవగాహన కల్పించేలా 8వ, ఆపై క్లాసుల విద్యార్థులకు ప్రతి శనివారం ప్రత్యేక తరగతులు నిర్వహించే యోచన చేస్తున్నామన్నారు. రవాణాశాఖ అధికారులపై అనేక ఆరోపణలు వస్తున్నాయన్నారు. ఇటీవల ఓ అధికారి అవినీతిపై వీడియో తీసి తనకు పంపారని, అలాంటి వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి హెచ్చరించారు. శాఖలో పనిచేసే అధికారులకు త్వరలో పదోన్నతులు ఇవ్వనున్నట్టు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంవీ కృష్ణబాబు చెప్పారు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని కమిషనర్ పీఎస్‌పీ ఆంజనేయులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణాజిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
