రెండోసారి టీటీడీ బోర్డులో చెవిరెడ్డికి చోటు
Published: Saturday July 20, 2019

తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (తుడా) చైర్మన్‌కు టీటీడీ పాలక మండలి ఎక్స్‌అఫిషియో సభ్యుడిగా మళ్లీ అవకాశం వచ్చింది. ఈ మేరకు చట్టసవరణకు రాష్ట్ర కేబినెట్ శుక్రవారం అంగీకారం తెలిపింది. మరో వారం రోజుల్లో టీటీడీ పాలకమండలి సభ్యుల నియామకం జరగనున్న నేపథ్యంలో కేబినెట్ తుడా చైర్మన్ విషయంలో నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇది అమలులోకి వస్తే చంద్రగిరి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌గా ఉన్న తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి టీటీడీ పాలకమండలిలో రెండోసారి ఎక్స్‌అఫిషియో సభ్యుడిగా అవకాశం వచ్చినట్టు అవుతుంది.
2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తుడా చైర్మన్‌గా భూమన కరుణాకరరెడ్డిని నియమిస్తూ టీటీడీ ఎక్‌అఫిషియో సభ్యుడిగా కూడా ప్రత్యేక ఉత్తర్వులు ఇచ్చారు. ఆ తర్వాత 2007లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తుడా చైర్మన్‌గా నియమితులయ్యారు. పాత జీవోనే చెవిరెడ్డికి కూడా వర్తింపచేశారు. వైఎస్‌ఆర్ మరణానంతరం 2014లో అప్పటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్‌రెడ్డి దివంగత ఎమ్మెల్యే వెంకటరమణను తుడా చైర్మన్‌ను చేశారు. టీటీడీ ఎక్స్‌అఫిషియో జీవో వెంకటరమణకు కూడా వర్తించింది. దీంతో తుడా చైర్మన్ పదవికి ప్రాబల్యం పెరిగింది. అయితే 2016లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సదరు జీవోను రద్దుచేశారు. వైసీపీ అధికారంలోకి రాగానే పాత జీవోను పట్టుబట్టి చట్టసవరణ చేయించారు.
