గోదావరి నీటిని తెలంగాణకిచ్చేందుకే...

‘గోదావరి నీటిని తెలంగాణకి పరిమితం చేసేందుకే వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. మహారాష్ట్ర, ఛత్తీ్‌సఘడ్ నుంచి వచ్చే నీటిని తెలంగాణ మనకేదో దానధర్మం చేస్తున్నట్లు సీఎం జగన్ మాట్లాడుతున్నారు. పోలవరంలో ఏదో అవినీతి జరిగిందంటున్నారు. అవినీతి పరులకు అన్నీ అవినీతిగానే కన్పిస్తాయి’ అని ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలోనే పోలవరం అంచనాలు పెరిగాయన్నారు. వైఎస్ హయాంలో మట్టి పనులతో కమీషన్లు పోగేసుకోవటానికే కాలువలు తవ్వారన్నారు. అసలు ప్రాజెక్టు పనులు ప్రారంభించలేదన్నారు. కేంద్ర జలసంఘం, ఇతర చట్టబద్ధ సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రాజెక్టులో అవినీతి అని అధికార పార్టీ మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. పట్టిసీమ దండుగన్న వాళ్లు ఇప్పుడు నోరెత్తడం లేదన్నారు. రివర్స్ టెండరింగ్‌కు వెళ్లి, కాంట్రాక్టులు తక్కువకు చేస్తే మాకేమీ అభ్యంతరం లేదు. కానీ అనవసరంగా వివాదాలు చేస్తే, ఇప్పటికే పక్క రాష్ట్రాలు కోర్టుల్లో కేసులు వేశాయి. ఒక వేళ కోర్టు తీర్పులు ఏవైనా మనకు వ్యతిరేకంగా వస్తే ప్రాజెక్టు ఆగిపోతుంది. దానివల్ల రాష్ట్రం నష్టపోతుందని హెచ్చరించారు. గోదావరి లంకలో జగన్ బంధువు రవీంద్రనాఽథ్‌రెడ్డి అక్రమంగా కట్టిన థియేటర్‌ని ముందు తొలగించాలని డిమాండ్ చేశారు.
