చర్చిలకు భద్రత కల్పించాలి
Published: Thursday July 18, 2019

విశాఖ నగర పోలీసు కమిషనర్ ఆర్కే మీనా తన పరిధిలోని అన్ని పోలీసు స్టేషన్లకు, అసిస్టెంట్ కమిషనర్లకు పంపిన పై ఆదేశం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే... ఇప్పటిదాకా విశాఖపట్నంలో క్రైస్తవులపైనా, చర్చిలపైనా ఒక్కటంటే ఒక్క దాడి జరగలేదు. ఆ మాటకొస్తే... రాష్ట్రంలో మతపరమైన ఘర్షణలు జరగడం అత్యంత అరుదు. అయినప్పటికీ... విశాఖ పోలీసు కమిషనర్ మొత్తం సిబ్బందిని అత్యంత అప్రమత్తం చేస్తూ చర్చిలకు, క్రైస్తవులకు భద్రత కల్పించాలని ఉత్తర్వులు జారీ చేయడానికి కారణమేమిటి?
డేనియల్ శ్యామ్ అనే వ్యక్తి ‘సీఎం ప్రజా స్పందన పోర్టల్’ ద్వారా ఇచ్చిన వినతిపత్రాన్ని ఉటంకిస్తూ... విశాఖ కమిషనర్ ఈ నెల 4వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు.అలాగే.. కొందరు వ్యక్తులు స్వయంగా పోలీస్ కమిషనర్‌ను కలిసి నగరంలో చర్చిలు, క్రైస్తవులపై దాడులు జరిగే అవకాశం ఉందని ఒక వినతి పత్రం ఇచ్చినట్లు తెలిసింది. బాస్ నుంచి బలమైన ఆదేశాలు రావడంతో పోలీసులు రంగంలోకి దిగి చర్చిల వద్ద హడావుడి మొదలు పెట్టారు. ముఖ్యంగా శని, ఆదివారాల్లో మరింత ప్రత్యేక దృష్టి సారించారు.
చర్చిలకు సమీపంలో విశ్వహిందూ పరిషత్, ఆర్‌ఎ్‌సఎస్, బీజేపీకి సంబంధించిన వాళ్లు నివసిస్తుంటే... వారిని ప్రశ్నించడం, వారి కదలికలపై ఆరా తీయడం వంటివి చేస్తున్నట్లు తెలిసింది. దీంతో ఏమీలేని దానికి పోలీసులు ఇంత హడావుడి ఎందుకు చేస్తున్నారు.? విశాఖపట్నం చరిత్రలో ఎప్పుడైనా ఎక్కడైనా మతసంబంధ గొడవలు జరిగాయా? అని పోలీసులను ప్రశ్నిస్తున్నారు.
ఫిర్యాదు చేసిన వ్యక్తులు ఎవరు.? దాడులు జరుగుతాయని వాళ్లకు ఎక్కడి నుంచి సమాచారం వచ్చింది.? ఎవరైనా బెదిరించారా? ఇలాంటివి నిర్ధారించుకుని,బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకున్నా ఎవ్వరూ కాదనరని... అదేదీ లేకుండానే అనవసరమైన భయాందోళనలు సృష్టించడం సరికాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొందరు వ్యక్తులు వివాదాస్పద భూముల్లో ప్రార్థనాలయాలు నిర్మిస్తున్నారని, అటువంటి వ్యక్తులు కావాలనే ఇలాంటి ఫిర్యాదులు చేస్తున్నారన్న అనుమానాలు కూడా వ్యక్తం
అవుతున్నాయి. ‘‘నిజంగానే సున్నితమైన పరిస్థితులు నెలకొన్న పక్షంలో అన్ని మతాల ప్రార్థనాలయాలకు భద్రత కల్పిస్తూ... చట్టాన్ని అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించవచ్చు. కానీ, ఒక మతాన్ని మాత్రమే ప్రస్తావించడంతో ఇతర మతస్థులపై అనుమానాలు రేకెత్తించినట్లయింది’’ అని విశాఖకు చెందిన ఒక సామాజికవేత్త తెలిపారు.
ఇటీవలి కాలంలో నగరంలో చర్చిలపై, క్రైస్తవులపై దాడులు జరిగిన ఘటనలు లేవు. ఫిర్యాదులు కూడా అందలేదని పోలీసులే చెబుతున్నారు. ఏదీ లేకున్నా ఇలాంటి ఆదేశాలు కమిషనర్ ఇవ్వడానికి కారణం ఏమిటి? పైనుంచి ఏవైనా సూచనలు వచ్చాయా అనే చర్చ కూడా జరుగుతోంది. ఈ మొత్తం వ్యవహారంపై ఒక ప్రధాన రాజకీయ పార్టీ నాయకులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. శ్రీలంకలో చర్చిలపై దాడుల తర్వాత ఇక్కడ ఏదైనా జరుగుతుందేమోనని ముందు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు స్థానిక పోలీసు అధికారులు తమ ఉత్తర్వును సమర్థించుకుంటున్నట్లు తెలిసింది. అయినా శ్రీలంకలో పేలుళ్లు జరిగి మూడు నెలలు దాటిపోయింది. ఒకవేళ, విశాఖలో చర్చిలపైనా అలాంటి దాడులు జరగొచ్చనే అనుమానాలు ఉంటే స్వయంగా నిఘా విభాగాలు అప్రమత్తం చేస్తాయి. ఇవేవీ లేకున్నా పోలీసులు చేస్తున్న హడావుడిని సదరు పార్టీ నేతలు ఢిల్లీ వరకూ తీసుకెళ్లినట్లు సమాచారం. దీంతోపాటు... విశాఖ కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వు సోషల్ మీడియాలో జాతీయ స్థాయిలో షేర్ అవుతోంది.
