ఎస్‌బీఐ ఖాతాదారులకు శుభవార్త
Published: Saturday July 13, 2019

ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా నెఫ్ట్, ఆర్‌టీజీఎస్ లావాదేవీలపై విధిస్తున్న చార్జీలను ఎత్తివేస్తున్నట్లు దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ) ప్రకటించింది. నగదు రహిత ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దటంలో భాగంగా ఈ నెల 1 నుంచి ఈ తరహా లావాదేవీలపై చార్జీలను విధించరాదని ఆర్‌బీఐ ఆదేశించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆగస్టు 1 నుంచి మొబైల్ ఫోన్ల ద్వారా ఐఎంపీఎస్ (ఇమ్మీడియెట్ పేమెంట్ సర్వీస్) విధానంలో నగదు బదిలీ చేస్తే ఎలాంటి చార్జీలను విధించరాదని నిర్ణయించినట్లు ఎస్‌బీఐ తెలిపింది.
అలాగే ఆర్‌టీజీఎస్ (రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్) విధానం, నేషనల్ ఎలకా్ట్రనిక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్ (నెఫ్ట్) ద్వారా రూ.2 లక్షల వరకు నగదు బదిలీపై చార్జీలను మినహాయించినట్లు తెలిపింది. డిజిటల్ రూపంలో నగదు లావాదేవీలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. కాగా ఈ నెల 1 నుంచే యోనో, ఇంటర్నెట్ బ్యాంకింగ్ (ఐఎన్‌బీ), మొబైల్ బ్యాంకింగ్ (ఎంబీ) వినియోగదారుల కోసం ఆర్‌టీజీఎస్, నెఫ్ట్ చార్జీలను ఎస్‌బీఐ ఎత్తివేసింది. ఆగస్టు 1 నుంచి ఐఎన్‌బీ, ఎంబీ, యోనో ఖాతాదారుల కోసం ఐఎంపీఎస్ చార్జీలను ఎత్తివేస్తున్నట్లు తెలిపింది. జూలై 1వ తేదీకి ముందు నెఫ్ట్ లావాదేవీలపై రూ.1, రూ.5 చార్జీలను విధించగా, ఆర్‌టీజీఎస్ విధానంలో రూ.5-రూ.50 వరకు చార్జీలను వసూలు చేసింది.
2019 మార్చి చివరినాటికి ఎస్‌బీఐలో దాదాపు 6 కోట్లకు పైగా ఖాతాదారులు ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ను వినియోగిస్తున్నారు. ఇందులో 1.41 కోట్ల మంది మొబైల్ బ్యాంకింగ్ సర్వీసులను వినియోగిస్తున్నారు. మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీల్లో ఎస్‌బీఐ 18 శాతం మార్కెట్ వాటా కలిగి ఉంది. కాగా యోనో యూజర్లు కోటికి పైగా ఉన్నారు. నెఫ్ట్, ఐఎంపీఎస్, ఆర్‌టీజీఎస్ లావాదేవీలపై చార్జీలు ఎత్తివేయటంతో మరి కొంతమంది ఖాతాదారులు డిజిటల్ లావాదేవీల వైపు మళ్లే అవకాశం ఉందని ఎస్‌బీఐ తెలిపింది.
