రాష్ట్రాన్ని పులివెందులలా మారుస్తున్నారు
Published: Saturday July 06, 2019

‘రాష్ట్రంలో వైసీపీ పాలన మొదలైన 40 రోజుల వ్యవధిలోనే అరాచకాలు పెచ్చుమీరుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ మూకలు చేసిన దాడుల్లో టీడీపీకి చెందిన ఆరుగురు మృతిచెందారు. రాష్ట్రాన్ని మరో పులివెందులలా చేయాలని చూస్తున్నారు. చిలకలూరిపేటలో 90 మందిని అక్రమ కేసుల్లో అరెస్టు చేశారు. పార్టీ మారాలి.. లేకుంటే కేసులేనన్న నినాదంతో వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. టీడీపీకి ఓటు వేయడం వారు చేసిన పాపమా..’ టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు. ప్రకాశం జిల్లా చినగంజాం మండలం రుద్రమాంబపురంలో ఇటీవల వైసీపీ మూకల పాశవిక దాడితో మనస్తాపానికి గురై మృతిచెందిన బసంగారి పద్మ (27) కుటుంబ సభ్యులను శుక్రవారం ఆయన పరామర్శించారు. మొదట పద్మ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. అనంతరం ఆమె భర్తను, పిల్లలను, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా, ఉదయం పార్టీ శ్రేణులతో టెలికాన్ఫరెన్సులోను చంద్రబాబు మాట్లాడారు. ‘రుద్రమాంబపురంలో పద్మ మృతి ఘటన ఓ చీకటి రోజు. ఆమెను ఆమె భర్త బ్రహ్మయ్య సమక్షంలోనే దారుణంగా కొట్టి వివస్త్రను చేశారు. కొట్టికొట్టి చంపారు. ఆమెది ఆత్మహత్య కాదు. ఆమె చనిపోయేందుకు కారణమైన వారిని ఇంతవరకు పోలీసులు అదుపులోకి తీసుకోకపోవడం రాష్ట్రంలో అరాచక పరిస్థితికి దర్పణం పడుతోంది. ఐదు కోట్ల మంది ఆంధ్రులే కాక దేశవ్యాప్తంగా ఈ ఘటనను ప్రతి ఒక్కరూ ఖండించి నిరసన తెలపాలి.
ఆడబిడ్డలు పరువు, మానం కోసం బలిపశువులయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇంత ఘోరం జరుగుతున్నా ముఖ్యమంత్రి జగన్ స్పందించరు. హోంమంత్రి మహిళ అయి ఉండి కూడా ఇలాంటివి సహజమేనంటారు. ఇదే వారి కుటుంబంలో జరిగితే ఇలానే వ్యవహరిస్తారా? డీజీపీకి ఫిర్యాదు చేస్తే ఎగతాళి చేస్తారు. నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎంతో మంది సీఎంలను, ప్రతిపక్ష నేతలను, గూండాలను చూశాను. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. అంతకుముందు కూడా కొందరు మహిళలను వివస్త్రలను చేసి సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి పోస్టులు చేయడం లాంటి దారుణ కృత్యాలు చేశారు. పోలీసులు తమ తీరు మార్చుకోవాలి. ఎప్పుడూ ఒకే ప్రభుత్వం అధికారంలో ఉండదు. ప్రజలు తిరగబడితే పోలీసులు తట్టుకోలేరు. ఎంతమందిని అరెస్టు చేస్తారు.. ఎంత మందిని జైళ్లలో పెడతారు’ అని నిలదీశారు.
