పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తయ్యేందుకు మరో మూడేళ్లు
Published: Friday July 05, 2019

పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తయ్యేందుకు మరో మూడేళ్లు పడుతుందని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) చైర్మన్ ఆర్కే జైన్ స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనకు ముందు 2014 మార్చి 31 వరకూ రాష్ట్రప్రభుత్వం వ్యయం చేసిన నిధులపై కంప్ర్టోలర్ అండ్ ఆడిటర్ (కాగ్) నివేదిక ఇస్తేనే.. ప్రాజెక్టు కోసం రాష్ట్రం చేసే వ్యయాన్ని రీయింబర్స్‌మెంట్ చేస్తామని తేల్చిచెప్పారు. గత ఏడాది జూలై నుంచి తాము ఈ షరతులోనే చెల్లింపులు చేయడం లేదని తెలిపారు. గురువారం విజయవాడలోని జల వనరుల శాఖ కార్యాలయంలో జరిగిన పీపీఏ సమావేశం అనంతరం జైన్ విలేకరులతో మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్ విభజనకు ముందు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులకు సంబంధించి కాగ్ ఆడిట్ నివేదికను సమర్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రాజెక్టు తుది అంచనా వ్యయం రూ.55,478 కోట్లకు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) పరిధిలోని సాంకేతిక సలహా మండలి (టీఏసీ) ఆమోదం తెలిపిందని.. కానీ జల వనరుల శాఖ పరిధిలోని మరో కమిటీ ఆమోద ముద్ర వేయాల్సి ఉందని చెప్పారు. ఈ కమిటీ మరికొంత సమాచారాన్ని కోరిందన్నారు. ఆ సమాచారం కూడా అందజేస్తే.. నెలరోజుల్లోనే తుది అంచనాలకు ఆమోదం లభిస్తుందని చెప్పారు. ప్రస్తుతం గోదావరిలో కాఫర్ డ్యాం పనులు జరుగుతున్నాయన్నారు. వరద ఉధృతికి ఆ డ్యాం కొట్టుకుపోకుండా పాక్షికంగా నిర్మాణ పనులు సాగాయని.. పనులు కొనసాగించాలని రాష్ట్ర జల వనరుల శాఖను ఆదేశించామని తెలిపారు. అయితే కాఫర్ డ్యాం పనులు నత్తనడకన సాగుతున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులకు సంబంధించి కార్యాచరణను కోరుతున్నామన్నారు. తాము ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటిస్తామని తెలిపారు.
