తల్లి తండ్రి లేరు ,కళాశాల టాప్ ,సాయం కోసం ఎదురు చూపు ;

తల్లిదండ్రులు లేకపోయినా ఆ బాలుడు అధైర్య పడలేదు. ఆత్మవిశ్వాసంతో చదువుల తల్లిని నమ్ముకుని ముందుకు సాగుతున్నాడు. డిగ్రీ పూర్తి చేస్తున్న ఇతడు ఉన్నత చదువుల కోసం దాతల సాయాన్ని అర్థిస్తున్నాడు.
అనంతరపురం జిల్లా కదిరి మండలం ఆలంపూర్ గ్రామానికి చెందిన అనిల్‌కుమార్ (20) తల్లిదండ్రులు అతడి చిన్నప్పుడే చనిపోయారు. ప్రాథమిక, మాధ్యమిక విద్యను అనంతపురం, తిరుపతిలో చదివిన అనిల్ కుమార్ డిగ్రీ చేయడానికి నగరంలోని అనాథ విద్యార్థి గృహానికి చేరుకున్నాడు. చిక్కడపల్లిలోని అరోరా డిగ్రీ కళాశాలలో బీకాం ఫైనలియర్ చదువుతున్నాడు. ఈ సంవత్సరం జనవరిలో బెంగళూర్‌లోని ఐసీఎఫ్‌ఏఐ బిజినెస్స్ స్కూల్‌లో పోస్టు గ్రాడ్యుయేట్ ప్రోగ్రా మ్ ఇన్ మేనేజ్‌మెంట్ (పీజీపీఎం) అభ్యసించడానికి ఎంట్రెన్స్ రాశాడు. దీని లో ఎంపికై ఫిబ్రవరిలో ఇంటర్వ్యూకు కూడా హాజరయ్యాడు. అయితే ఈ కో ర్సు చదవడానికి రూ.7 లక్షల 26 వేలు అవసరమవుతున్నాయి. ఈ నెల 22 లోపు రూ.80 వేలు అడ్మిషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంది. ఆ ఫీజు చెల్లిస్తేనే అధికారికంగా కళాశాలలో సీటు కేటాయిస్తారు. మిగతా రూ.6 లక్షల 46 వేల ను ఐదు దఫాలుగా చెల్లించాల్సి ఉంటుంది. రెండేళ్ల పీజీపీఎం కోర్సు ఎంబీఏ కోర్సుతో సమానం. హాస్టల్ వసతి కింద రెండేళ్లకు రూ.లక్షా 20 వేలు చెల్లించాలి. ఈ కోర్సు పూర్తి చేయడానికి అనిల్‌కుమార్ కు రూ.8 లక్షల 46 వేలు ఖర్చవుతాయి. అనాథనైన తాను ఈ ఫీజును భరించలేనని, దాతలు సాయం చేస్తే తన లక్ష్యాన్ని చేరుకుంటానని అనిల్‌కుమార్ వేడుకుంటున్నాడు.
దాతలు సహకరిస్తేనే భవిష్యత్తు..
అనిల్‌కుమార్ ఉన్నత చదువుల కోసం దాతలు ముందుకు వచ్చి ఆదుకోవాలని అనాథ విద్యార్థి గృహం ప్రధాన కార్యదర్శి మార్గం రాజేశ్ విజ్ఞప్తి చేశారు. బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో బుధవారం ఆయన అనిల్‌కుమార్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మార్గం రాజేశ్ మాట్లాడుతూ అనిల్ కుమార్ పదో తరగతిలో 9.2 జీపీఏ, ఇంటర్‌లో 75 శాతం మార్కులను సాధించాడని, బెంగళూర్‌లోని ఐసీఎ్‌ఫఏఐ బిజినెస్ స్కూల్‌లో సీటు సంపాదించడం అంత సులువు కాదని, ఇందుకు అనిల్ కుమార్ కష్టపడ్డాడని వివరించారు.
ఇంటర్వ్యూలో కూడా ఎంపికైన అనిల్‌కుమార్ భవిష్యత్తు దాతలు సహకారం పైనే ఆధారపడి ఉందని పేర్కొన్నారు. విద్యార్థి అనిల్‌కుమార్ మాట్లాడుతూ డిగ్రీ మొదటి సంవత్సరంలో 79 శాతం, ద్వితీయ సంవత్సరంలో 87 శాతం మార్కులు సాధించానని, ప్రస్తుతం ఫైనలియర్ పరీక్షలు రాస్తున్నానని తెలిపాడు. ఐసీఎఫ్‌ఏఐ బిజినెస్ స్కూల్‌లో చదవాలనే పట్టుదల ఉందని దాతలు సహకరిస్తే కోర్సును పూర్తి చేస్తానని అనిల్‌కుమార్ వేడుకున్నాడు. నేరుగా నగదు సహాయం చేయదల్చిన దాతలు కొత్తపేట ఆంధ్రాబ్యాంక్‌లోని అకౌంట్ నెంబర్ 019210011904302, ఐఎఫ్‌ఎస్సీ కోడ్ ఏఎన్‌డీబీ0000192లో జమ చేయవచ్చని వారు తెలిపారు.
