కూల్చేసేముందు ఆలోచించండి

అమరావతి: ప్రజావేదిక కూల్చివేస్తామని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించడంపై విజయవాడ ఎంపీ కేశినేని నాని స్పందించారు. ప్రజావేదికను ఇప్పటికిప్పుడు తొలగిస్తే ప్రభుత్వ ఖజానాకు రెండు రకాల నష్టమన్నారు. తన ఫేస్‌బుక్ పేజీ ద్వారా అభిప్రాయాలను వెల్లడించారు. ఆయనేమన్నారంటే ‘‘ప్రజావేదిక అక్రమమో, సక్రమమో పక్కన పెడితే, అది ప్రజాధనంతో నిర్మించినటువంటి వేదిక. కాబట్టి ప్రజావేదికను తొలగించాలనుకుంటే, అక్రమ నిర్మాణాలన్ని తొలగించిన తర్వాత, ప్రజావేదికను చివర్లో తొలగిస్తే బావుంటుంది. మొదటి విషయం.. ప్రజాధనంతో నిర్మించారు కాబట్టి, అది కూల్చేస్తే ఆ సొమ్ము వృథా అవుతుంది. రెండో విషయం ఏంటంటే, మరో వేదిక కట్టేవరకు ప్రభుత్వ సమావేశాలను నిర్వహించుకోవాలంటే ప్రైవేట్ వేదికలకు డబ్బు ఖర్చవుతుంది. కాబట్టి ముందుగా మిగతా అక్రమ నిర్మాణాలను తొలగించి, ఈ లోపు కొత్త సమావేశ వేదిక నిర్మించి, అప్పుడు ఈ ప్రజావేదిక తొలగిస్తే బావుంటుంది అంటూ తన అభిప్రాయాలను వెల్లడించారు.
