అవినీతిపారుదల గుట్టు తేల్చాలి: సీఎం
Published: Sunday June 23, 2019

నీటి పారుదల ప్రాజెక్టులన్నీ అవినీతి పారుదల ప్రాజెక్టులుగా మారాయని, తక్షణం వాటిని సమీక్షించాలని నిపుణుల కమిటీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు. అవినీతిలో మన రాష్ట్రం నంబర్‌వన్ అని దేశం మొత్తం మాట్లాడుకునే పరిస్థితి గత ప్రభుత్వం వల్ల వచ్చిందని, ఈ అంశాన్ని వదిలేసే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. సాగునీటి రంగంలో ప్రభుత్వం ఇటీవల నియమించిన నిపుణుల కమిటీతో శనివారం సీఎం సమీక్ష నిర్వహించారు. రూ.100 వస్తువు రూ.80కే వస్తుంటే, ఎవరైనా రూ.100కి కొంటారా అని ఈ సందర్భంగా జగన్ ప్రశ్నించారు.
‘‘ప్రాజెక్టుల్లో భారీగా అవినీతి, దోపిడీ జరిగాయి. ఒక్క పోలవరం ప్రాజెక్టులోనే అనేక కుంభకోణాలు జరిగాయి. కాబట్టి, నిపుణుల కమిటీ తొలుత పోలవరం ప్రాజెక్టుపై దృష్టిపెట్టాలి. ఆ తర్వాత గృహనిర్మాణం, గాలేరు నగరి, హంద్రీ నీవా, వంశధార ప్రాజెక్టుల్లోని అక్రమాలు, అవకతవకలను వెలికితీయాలి. రివర్స్ టెండరింగ్ ద్వారా ధనాన్ని మిగుల్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ టెండరింగ్ ద్వారా ఏఏ పనుల్లో నిధులు ఆదా చేయగలమో గుర్తించండి. రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రజాధనాన్ని మిగిల్చిన అధికారులను సన్మానిస్తాం’’ అని సీఎం ఆదేశించారు. కమిటీకి ఆర్థికంగా, సాంకేతికంగా సహకారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.
