వాట్సప్‌లో కలకలం రేపిన ఇంటర్ ప్రశ్నపత్రం

ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం కెమిస్ట్రీ పరీక్ష మొదలైన వెంటనే కడప జిల్లా రాయచోటిలో ప్రశ్నపత్రం వాట్సప్‌లో బయటకు వచ్చిందన్న ప్రచారం కలకలం రేపింది. దీనిపై అనేక కథనాలు వినిపిస్తున్నాయి. ఓ జాతీయ పార్టీకి అనుబంధంగా ఉన్న విద్యార్థి సంఘం నాయకుడు, మరో విద్యార్థి నేత కలిసి వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేశారని సమాచారం. ఈ గ్రూప్‌లో రాయచోటి నియోజకవర్గానికి చెందిన పలు ప్రైవేటు కళాశాలల కరస్పాండెంట్లు, అధికారులు కలిపి 59 మంది వరకు సభ్యులుగా ఉన్నట్లు చెబుతున్నారు.
ఈ వాట్సప్ గ్రూపులోకి బుధవారం ఉదయం 9.06 నిమిషాలకు పట్టణంలోని ఓ ప్రైవేటు కళాశాలలో పనిచేస్తున్న వ్యక్తి ప్రశ్నపత్రాన్ని పోస్ట్ చేసినట్లు తెలిసింది. నిమిషాల వ్యవధిలోనే ఇది సోషల్ మీడియాలో జోరుగా చక్కెర్లు కొట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని కొందరు మీడియా దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై పోలీసులను ఆరా తీయగా వారు తమ దృష్టికి రాలేదన్నారు. సంబంధిత అధికారులు ఫిర్యాదు చేస్తే విచారణ చేపడతామన్నారు.
