రవిప్రకాశ్ కేసులో పోలీసుల ఆరోపణ
Published: Tuesday June 11, 2019

ఫోర్జరీ ఆరోపణలు ఎదుర్కొంటున్న టీవీ-9 మాజీ సీఈఓ విచారణకు సహకరించలేదని తెలంగాణ పోలీసులు రాష్ట్ర హైకోర్టు దృష్టికి తెచ్చారు. ‘‘కొత్త యాజమాన్యం వచ్చినా నలుగురు డైరెక్టర్ల పేర్లు వెబ్‌సైట్‌లో పెట్టకుండా అడ్డుపడేందుకు అడ్డదారులు తొక్కారు. డీల్ అడ్డుకునేందుకు శివాజీని తెరపైకి తెచ్చారు. కంపెనీ సెక్రటరీ సంతకాలను ఫోర్జరీచేశారు’’ అని పోలీసుల తరఫు న్యాయవాది హరీన్ రావెల్ విన్నవించారు.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ముందస్తు బెయిలు పిటిషన్ సోమవారం హైకోర్టులో విచారణకు వచ్చింది. తెలంగాణ పోలీసులు చేపట్టిన దర్యాప్తు లోపాలమయమని, అందుకే ముందస్తు బెయిల్ కోరుతున్నానని రవిప్రకాశ్ తెలిపారు. ‘‘రవిప్రకాశ్‌పై ఈ ఏడాది ఏప్రిల్ 24, 30, మే 16 తేదీల్లో మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. దర్యాప్తులో దోషాలు ఉన్నప్పుడు ముందస్తు బెయిలు కోరే హక్కు ఉంది. ఇప్పటికే 40 గంటలకు పైగా దర్యాప్తు అధికారులు ఇంటరాగేట్ చేశారు. వారు కోరుకున్న విధంగా చెప్పించి కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు’’ అని ఆయన తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది దల్జీత్‌సింగ్ ఆహ్లూవాలియా ఆరోపించారు. ముందస్తు బెయిలు కోసం కోర్టు ఎలాంటి షరతులు విధించినా కట్టుబడి ఉంటారని కోర్టుకు తెలిపారు.
‘‘సైఫ్ మారిసిష్ కంపెనీ 2018 ఫిబ్రవరి 8న నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్టీ)లో రూ.350 కోట్లకు కేసు వేసింది. ఈ కేసులో ఎన్‌సీఎల్టీ స్టే ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈ స్టే ఆదేశాలు అమలులో ఉండగానే వాటాల (షేర్స్) బదిలీ పూర్తి చేశారు. ఎన్‌సీఎల్టీ ఆదేశాలకు భిన్నంగా వాటాలు బదిలీ అయ్యాయి. అయినా సైఫ్ మారిసిష్ సంస్థ మౌనంగా ఉండిపోయింది. రహస్య ఒప్పంద మేరకే అలా వ్యవహరించింది’’ అని రవిప్రకాశ్ తరఫు న్యాయవాది ఆరోపించారు. సమయం ముగియడంతో కోర్టు తదుపరి వాదనల్ని మంగళవారానికి వాయుదా వేసింది.
రవిప్రకాశ్ కేసు వ్యవహారం మంగళవారం తేలిపోయే అఽవకాశం ఉందని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. ‘‘రవిప్రకాశ్ ఫోర్జరీ చేసినట్లు మా వద్ద ఉన్న సాంకేతిక ఆధారాలు, సేకరించిన ఇతర ఎవిడెన్స్‌ను కోర్టుకు సమర్పించాం. రవిప్రకాశ్‌ను మూడు రోజులపాటు విచారించినా పొంతనలేని సమాధానాలు చెప్పి గందరగోళ పరిచే ప్రయత్నం చేశారు. అందుకు సంబంధించి రికార్డుచేసిన సాక్ష్యాధారాలను, విచారణ నివేదికను కోర్టుకు అందజేశాం’’ అని సైబరాబాద్ పోలీసులు తెలిపారు.
