గ్రామీణ ప్రాంతాల్లో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు

సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వాస్పత్రులకు కూడా విస్తరిస్తున్నాయి. ఇకపై పల్లెవాసులు నగరాలకు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి ఉండబోదు. ఇప్పటికే అనేక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల(పీహెచ్‌సీ)ను కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు(సీహెచ్‌సీ)గా, సీహెచ్‌సీలను ఏరియా ఆస్పత్రులుగా, ఆరు ఏరియా ఆస్పతులు జిల్లా ఆస్పత్రులుగా.. ఇలా ఏడాది కాలంలో 50కిపైగా ఆస్పత్రులను అప్‌గ్రేడ్ చేశారు. దీనికి తగ్గట్లుగా ఆధునిక వైద్య పరికరాలను ఆయా సెంటర్లలో ఆరోగ్యశాఖ అందుబాటులోకి తీసుకొస్తోంది. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్‌లో ఉన్న 20ు నిధులతో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలకు ఉపయోగపడే పరికరాలను ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ ద్వారా అధికారులు కొనుగోలు చేయనున్నారు. ప్రస్తుతానికి 27 ఆస్పత్రుల్లో మొదటి విడతలో ఆర్థో(ఎముకలు) శస్త్రచికిత్సలకు అవసరమైన ‘సీ-ఆర్మ్’ మిషన్లు, టేబుల్స్‌ను ఆరోగ్యశాఖ కొనుగోలు చేస్తోంది. దీనికోసం ట్రస్ట్ సుమారు రూ.5కోట్లు విడుదల చేసింది. కొత్త మిషన్లు జూన్ నెలాఖరు నాటికి అందుబాటులోకి రానున్నాయి. ఫలితంగా గుడివాడ, బాపట్ల, నరసరావుపేట వంటి ఏరియా ఆస్పత్రుల్లోని ఆర్థో విభాగంలో సూపర్ స్పెషాలిటీ శస్త్రచికిత్సలు అందుబాటులోకి వస్తాయి. రెండో విడతలో మరో 30 ఆస్పత్రులకు వీటిని సమకూరుస్తారు.
