డీజీపీలకు సెంటిమెంటుగా ఎన్టీఆర్ భవనంలో కొలువు
Published: Saturday June 01, 2019

విజయవాడలోని ఎన్టీఆర్ పరిపాలనా భవనంలోకి వచ్చిన ఐపీఎ్‌సలు వరుసగా డీజీపీలు అవుతున్న వైనంపై పోలీసు సిబ్బందిలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ‘మా బాస్‌లకు ఈ బిల్డింగ్ కలసి వస్తోంది’ అంటూ ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలోని భవనాన్ని వారు చూపిస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత విజయవాడలో వేగవంతంగా పూర్తి అయిన నిర్మాణం ఎన్టీఆర్ పరిపాలనా భవనమే. ఈ భవనాన్ని ఆర్టీసీ ఎండీ హోదాలో నండూరి సాంబశివరావు సిద్ధం చేశారు. ఆ తరువాత ఆయన 2016 జూలై 22న రాష్ట్ర పోలీస్ బాస్‌గా నియమితులయ్యారు. ఆ తర్వాత ఆ పోస్టులోకి వచ్చిన మాలకొండయ్యను 2017 డిసెంబర్ 31న డీజీపీగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. 2018 జూన్ 30న పదవీ విరమణ చెందిన మాలకొండయ్య స్థానంలో, అదే భవనంలో రెండో అంతస్తులోని ఏసీబీ కార్యాలయంలో ఉన్న ఆర్పీ ఠాకూర్‌ను రాష్ట్ర ప్రభుత్వం డీజీపీగా నియమించింది. అప్పటి వరకూ విజయవాడ పోలీస్ కమిషనర్‌గా ఉన్న గౌతమ్ సవాంగ్‌ను విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా నియమించడంతో..ఎన్టీఆర్ పరిపాలనా భవనంలోని మూడో అంతస్తులో ఉన్న కార్యాలయంలోకి వెళ్లారు.
తాజాగా ప్రభుత్వం మారడంతో గౌతమ్ సవాంగ్‌ను డీజీపీ పదవి వరించింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఐపీఎస్ అధికారుల్లో 1986 బ్యాచ్‌కు చెందిన కౌముది కేంద్ర సర్వీసుల్లో ఉండగా, ఠాకూర్ ఇప్పటి వరకూ డీజీపీగా కొనసాగారు. అదే బ్యాచ్‌కు చెందిన సవాంగ్ డీజీగా ఎంపికవగా, మరో అధికారి రే వినయ్ రంజన్ ఈ ఏడాది పదవీ విరమణ చెందబోతున్నారు. ఆ తర్వాత 1987 బ్యాచ్‌కు చెందిన సురేంద్రబాబుకే డీజీపీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.
