సీఎం జగన్‌కు మాజీ మంత్రి గంటా సూచన

Published: Saturday June 01, 2019
‘‘రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జగన్‌ కక్షపూరిత ఽధోరణితో కాకుండా ప్రజల అవసరాలను గుర్తించి మంచి సీఎం అనిపించుకోవాలి. ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఆయన ప్రసంగం కొంచెం హుందాగా ఉంటే బాగుండేది. టీడీపీపైనే కాకుండా మీడియాపై కూడా విమర్శలు గుప్పించారు’’ అని మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. ‘‘ఎన్నికలకు ముందు జగన్‌ చెప్పినవన్నీ జరుగుతాయా లేదా అనే అనుమానాలు అప్పుడే ప్రజల్లో మొదలయ్యాయి. ఢిల్లీలో మోదీని కలిసి ‘ప్రత్యేక హోదా తేలేము. విన్నపంగానే అడగాలి’ అంటూ హోదా డిమాండును అక్కడే వదిలేసి వచ్చారు. పోలవరం కాంట్రాక్టులను రద్దు చేస్తాననడం పాత ప్రభుత్వంపై కక్ష తీర్చుకునే వైఖరిగా ప్రజలు గమనిస్తున్నారు. పాజిటివ్‌ మైండ్‌తో ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని వమ్ము చేసుకోకుండా పాలన అందిస్తే బాగుంటుంది. టీడీపీ తరఫున వ్యక్తిగతంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయాలని నాతోపాటు పయ్యావుల కేశవ్‌, అచ్చెన్నాయుడిని పార్టీ నియమించింది. అయితే రెండు రోజులు ప్రయత్నించినా అవకాశం కుదర్లేదు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీకి వ్యతిరేక పవనాలు వీచినప్పటికీ విశాఖ నార్త్‌ నుంచి నన్ను గెలిపించి, ప్రజలకు సేవచేసుకునే అవకాశం మరోసారి కల్పించినందుకు శ్రీ వేంకటేశ్వరస్వామికి తలనీలాలు సమర్పించి ఆశీస్సులు తీసుకున్నా. శ్రీవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలకు ఉండాలని కోరుకున్నాను. అధిక సీట్లు వైసీపీకే వచ్చినప్పటికీ 40 శాతం ప్రజల మద్దతు టీడీపీకి ఉంది. మా నాయకుడు చంద్రబాబు చెప్పినట్టు ఆరు నెలలు నూతన ప్రభుత్వ పనితీరును పరిశీలించి, ఆ తర్వాత ప్రజల పక్షాన పోరాడతాం. ప్రతిపక్ష నేతగా చంద్రబాబే ఉంటారు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఆయన నాయకత్వం పార్టీకి ఎంతో అవసరం’’ అని గంటా అన్నారు.