మరణం గురించి హాకింగ్ ఏమన్నారంటే..

ఇంటర్నెట్‌డెస్క్: ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, అపర ఐన్‌స్టీన్ స్టీఫెన్ హాకింగ్(76) ఇకలేరు. కలిసిరాని విధిని సైతం తనకు అనుకూలంగా మార్చుకుని భౌతిక శాస్త్రంలో ఎన్నో ఆవిష్కరణలు చేసిన హాకింగ్ బుధవారం ఉదయం తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. శరీరం సహకరించకపోయినా, కదల్లేని స్థితిలో ఉన్నా ఎన్నో సిద్ధాంతాలు.. మరెన్నో అధ్యయనాలు చేశారు. ఆత్మస్థైర్యానికి నిదర్శనంగా నిలిచారు. జీవితంలో ఎన్నో మలుపులను చూసిన హాకింగ్ ఏనాడూ మరణం గురించి బాధపడలేదు, భయపడలేదు. చనిపోయేందుకు తాను దిగులు చెందట్లేదని.. అయితే అంతకు ముందు చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయని అన్నారు. మృత్యువు గురించి ఒకానొక సమయంలో ఆయన ఏమన్నారంటే..
"మరణం తర్వాత జీవితం లేదు. స్వర్గం అనేది ఒక కట్టుకథ. మరణం తర్వాత జీవితం, స్వర్గం, నరకం వంటివి ఏమీ లేవు. ఇవన్నీ మృత్యువు అంటే భయపడేవారి కోసం అల్లిన కట్టుకథలు. మనిషి మెదడు కూడా కంప్యూటర్ వంటిదే. విడిభాగాలు పాడైన తర్వాత కంప్యూటర్ పని చేయటం ఆగిపోయినట్టే మెదడు ఆగిపోతుంది. ఒక్కసారి మెదడు నిలిచిపోయిన తర్వాత ఏమీ ఉండదు. కన్నుమూసేలోపే మనకున్న శక్తిసామర్థ్యాలను పూర్తిస్థాయిలో వినియోగిస్తూ మంచి జీవితం గడపాలి. మనం చేసే పనులు అత్యున్నతంగా ఉండటానికి కృషి చేయాలి. 49 ఏళ్లుగా మరణం నాకు అత్యంత సమీపంలోనే ఉంటోంది. అయినప్పటికీ నేను మృత్యువు కు భయపడటం లేదు. త్వరగా మరణించాలని నేను భావించటం లేదు. నేను కన్నుమూసేలోపు చేయాల్సిన పనులు ఎన్నెన్నో ఉన్నాయి".
