విశాఖ కేంద్రంగా జనసేన పోరాటం

జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ సామాజిక సమస్యలపై ఈ మధ్యకాలంలో రెండుసార్లు విశాఖపట్నం వచ్చి సమావేశాల్లో పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ వ్యాధులపై ప్రభుత్వం స్పందించడం లేదని, వారికి పరిష్కారం చూపాలని ఆయన డిమాండ్ చేశారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయం వైద్య నిపుణులను విశాఖపట్నం రప్పించి, వారితో ఇక్కడ కిడ్నీ సమస్యలపై చర్చావేదిక నిర్వహించారు. ఎటువంటి పరిష్కారం అవసరమో అభిప్రాయాలు సేకరించారు. శ్రీకాకుళం జిల్లాలో ఈ వ్యాధులపై దీర్ఘకాలంగా పరిశోధనలు చేస్తున్న వారిని పిలిచి వారి అభిప్రాయాలను తీసుకున్నారు.
ఆ తరువాత విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తున్న డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను ప్రైవేటీకరించడానికి నిర్ణయించినప్పుడు ఉద్యోగులు, ప్రజాసంఘాలు ఆందోళన చేపట్టాయి. దీనికి పవన్‌కల్యాణ్ మద్దతు ప్రకటించారు. లాభాల్లో ఉన్న కంపెనీని ప్రైవేటీకరించడం ఏమిటని కేంద్రాన్ని నిలదీశారు. ఓ ఉద్యోగి ఆత్మహత్య చేసుకుంటే...పార్లమెంటు సభ్యులు ఎవరూ అంతవరకు పరామర్శించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. తాజాగా విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ సాధనపై కూడా జనసేనాని దృష్టి పెడతారని పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు.
