రోగి రాగానే.. తలుపులు బంద్
Published: Sunday May 05, 2019

ఓ బ్యాచిలర్ డాక్టర్ వైద్యం కోసం వచ్చిన మహిళతో అసభ్యంగా ప్రవర్తించి అడ్డంగా దొరికిపోయాడు. అతడి ప్రవర్తనతో మనస్తాపం చెందిన బాధితురాలు భర్త, స్థానికులతో వచ్చి డాక్టర్‌ను చితకబాది పోలీసులకు అప్పగించింది. శనివారం మధ్యాహ్నం ఉప్పల్ చిలుకానగర్ బస్తీ దవాఖానాలో ఈ ఘటన జరిగింది. జీహెచ్‌ఎంసీ, వైద్యారోగ్యశాఖ సమన్వయంతో పేదలకు చేరువగా బస్తీల్లో బస్తీదవాఖానాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరి 22 నుంచి సేవలందిస్తున్న చిలుకానగర్ బస్తీ దవాఖానాలో ఉప్పల్ శివారులోని మేడిపల్లి ప్రాంతంలో నివసించే డాక్టర్ బాల్‌రాజ్(27) రోగులకు చికిత్స చేస్తున్నాడు.
ఈనెల 2న చిలుకానగర్‌కు చెందిన పుష్ఫ అనే మహిళ తలనొప్పిగా ఉండడంతో బస్తీ దవాఖానాకు వచ్చింది. డాక్టర్ బాల్‌రాజ్ ఆమెను ‘దగ్గరగా కూర్చో. నేను రష్యాలో ఎంబీబీఎస్ చదివాను. తలనొప్పికి ప్రత్యేక వైద్యం చేస్తా. ఇట్టే నీ నొప్పి మాయవమవుతుంది’ అని మాయ మాటలు చెప్పాడు. మహిళ వెనుక నుంచి తలపై మసాజ్ చేస్తూ కళ్లు మూసుకోమని చెప్పాడు. అతి దగ్గరగా వెళ్లి మసాజ్ చేస్తుండడంతో ఆమెకు ఏం చేయాలో పాలుపోలేదు. అయోమయంలో ఉండగానే ఆమె తల వెంట్రుకలు కొన్నింటిని కత్తిరించి దాచుకున్నాడు. భయాందోళనకు గురైన ఆమె నేను వెళ్లిపోతాను డాక్టర్ అని చెప్పడంతో, ‘అలాకాదు.
నువ్వు ఎవరికీ చెప్పకుండా అమావాస్య రోజు(ఈ నెల 4న) మధ్యాహ్నం 2 గంటలకు ఒంటరిగా రా. బాగా ట్రీట్‌మెంట్ చేస్తా’ అని డాక్టర్ చెప్పాడు. ఇంటికి వెళ్లిన మహిళ జరిగిన విషయాన్ని భర్తకు తెలిపింది. తల వెంట్రుకలు కత్తిరించిన విషయాన్ని కూడా ఆలస్యంగా గుర్తించింది. శనివారం ఉదయం 11 గంటలకు భర్త, స్థానికులతో కలిసి ఆస్పత్రికొచ్చి, ‘తల వెంట్రుకలు ఎందుకు కట్ చేశావు. ఎందుకు అసభ్యంగా ప్రవర్తించావు’ అంటూ డాక్టరు బాల్‌రాజ్‌ను నిలదీసింది. కత్తిరించిన వెంట్రుకలు ఏం చేశావని, అమావాస్య రోజు ఎందుకు రమ్మన్నావని, కత్తిరించిన వెంట్రుకలతో ఏవైనా క్షుద్ర పూజలు చేస్తావా అని అతడిని చితకబాదింది. స్థానికులు సైతం డాక్టరుకు దేహశుద్ధి చేశారు. సమాచారం అందుకున్న ఉప్పల్ పోలీసులు వచ్చి డాక్టర్‌ను పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఐపీసీ 354 సెక్షన్ కింద కేసు నమోదుచేసి విచారిస్తున్నట్లు తెలిపారు.
