తుఫాన్లకు పేర్లెందుకంటే..?
Published: Friday May 03, 2019

ఓనిల్, నీలం, హుద్‌హుద్, ఐలా, తితలీ, గజ, పెథాయ్.. ఇవన్నీ తుఫాన్ల పేర్లు. తాజాగా ‘ఫణి’ దూసుకొస్తోంది. అయితే ఈ పేర్లన్నీ ఏమిటి.. ఎలా వచ్చాయి..? అంటే.. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ తుఫాన్లు ఏర్పడినా వాటికి పేర్లు పెట్టడం ఆనవాయితీ. తొలుత అమెరికాలో ఈ సంప్రదాయం మొదలైంది. అయితే ఉత్తర హిందూ మహాసముద్రం పరిసరాల్లో ఏర్పడిన తుఫాన్లకు 2004 సెప్టెంబర్ నుంచి పేర్లు పెట్టడం మొదలెట్టారు. ఆ పరిసర దేశాలైన భారత్, పాకిస్థాన్, ఒమన్, బంగ్లాదేశ్, శ్రీలంక, థాయ్‌లాండ్, మయన్మార్, మాల్దీవులు కొన్ని పేర్లు సూచిస్తాయి. తొలుత బంగ్లాదేశ్‌కు చెందిన ‘ఓనిల్’ పేరుతో ఇది మొదలైంది.
2004 నుంచి ఇప్పటివరకు (ఫణితో కలుపుకొని) ఉత్తర హిందూ మహాసముద్రంలో 57 తుఫాన్లు సంభవించాయి. గతంలో ఫలానా చోట, ఫలానా సంవత్సరం తుఫాన్ వచ్చిందని నిపుణులు చెబుతుండేవారు. అప్పట్లో దివిసీమ తుఫాన్, బలుసుతిప్ప తుఫాన్, కావలి తుఫాన్ అని పిలిచేవారు. 1970లో బంగ్లాదేశ్‌లో భోలా ప్రచండ తుఫాన్ ప్రసిద్ధి చెందింది. అదే ఏడాది బంగ్లాదేశ్‌లో ఫ్లాగ్‌షిప్ పాయింట్ వద్ద మరో ప్రచండ తుఫాన్ వచ్చింది. తుఫాన్ తీరం దాటే ప్రాంతాన్ని బట్టే వాటికి పేరు పెట్టేవారు. అయితే ఒకే ప్రాంతంలో ఎక్కువ తుఫాన్లు సంభవించినప్పుడు వాటిని గుర్తించడం ఇబ్బందిగా ఉండేది. అందువల్ల అమెరికా మాదిరిగా తుఫాన్లకు పేర్లు పెట్టడం ప్రారంభించారని వాతావరణ అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం సిరీస్ లో ఏడు పేర్లు మిగిలి ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో వచ్చే సిరీ్‌సలో పేర్లను ఎనిమిది దేశాల కూటమి ఖరారు చేసిందన్నారు.
