అభ్యర్థుల నుంచి లక్షలు దండుకున్న డీఎస్పీలు
Published: Friday May 03, 2019

ఐదేళ్లకొకసారి వచ్చే ఎన్నికల్లో సబ్ డివిజన్ల బాధ్యతలు దక్కడం.. సబ్‌డివిజినల్ పోలీసు అధికారులు(ఎస్‌డీపీవో)గా ఉండే డీఎస్పీలకు పండగేనని పోలీసు వర్గాలు అంటుంటాయి. ఈ దఫా సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో దాదాపు పది జిల్లాల్లో డీఎస్పీలు అధికార, ప్రతిపక్షాల నుంచి రెండు వైపులా భారీగా డబ్బులు లాగేసినట్లు తెలుస్తోంది. కొన్ని జిల్లాల నుంచి పోలీసు హెడ్‌క్వార్టర్స్‌కు నేరుగా ఫిర్యాదులు వస్తుండగా.. మూడు జిల్లాల నుంచి సాక్షాత్తూ ఎస్పీలే డీజీపీకి రహస్య నివేదికలు పంపినట్లు సమాచారం. ఇవి ప్రస్తుతం డీజీపీ ఠాకూర్ పరిశీలనలో ఉన్నాయి. ఆధారాలున్నవారిపై వెంటనే వేటు వేయాలని.. ఆరోపణలు వచ్చినవారిపై విచారణకు ఆదేశించాలని ఆయన యోచిస్తున్నట్లు తెలిసింది.
ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులకు అన్ని విధాలా సహకరిస్తామని పలువురు డీఎస్పీలు వారి నుంచి డబ్బులు తీసుకున్న ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. అనంతపురం నుంచి అమలాపురం వరకూ.. ఏదో ఒక పార్టీ నుంచే గాక.. రెండు ప్రధాన పార్టీల నుంచీ డబ్బులు తీసుకుని.. ఇద్దరితోనూ మీకే సహకరిస్తామని హామీ ఇచ్చారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఎలాగైనా అధికారంలోకి రావాలని ఒక పార్టీ హై కమాండ్ ‘పోలీసులకు ముందుగా డబ్బులు ఇచ్చేయండి.. ఓటర్లకు పంచేందుకు ఇబ్బంది ఉండదు’ అని ఆదేశించినట్లు బలంగా వినిపిస్తోంది. అనంతపురం జిల్లాలో ఇద్దరు డీఎస్పీలకు ఒక రాజకీయ పార్టీ నుంచి ఆఫర్ వచ్చింది. ‘నేను అటు తీసుకోలేదు.. మీ వద్దా తీసుకోను’ అని ఆయన తిరస్కరించగా.. మరో డీఎస్పీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారని.. అభ్యర్థులిద్దరి వద్దా పుచ్చుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఆయన పరిధిలో మూడు అసెంబ్లీ స్థానాలు ఉండగా ఒక పార్టీ నుంచి రూ.10 లక్షల చొప్పున, మరో పార్టీ నుంచి రూ.5 లక్షల లెక్కన తీసుకున్నట్లు సమాచారం.
కర్నూలు జిల్లాలో ఒక డీఎస్పీపై ఇటువంటి ఆరోపణలు ఉన్నాయి. మొదటి నుంచి ఆయన డబ్బుకే ప్రాధాన్యం ఇచ్చారని, శాంతిభద్రతలపై ఆశించిన స్థాయిలో దృష్టి సారించలేదన్న ఆరోపణలున్నాయి. ప్రకాశం జిల్లాలో ఒక డీఎస్పీ నేరుగా అభ్యర్థులతోనే డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. గుంటూరు జిల్లాలో ఒక డీఎస్పీ రెండువైపులా ఫోన్లు చేసి మరీ డబ్బులు తీసుకున్నారని.. ప్రతి అసెంబ్లీ అభ్యర్థి పది లక్షలకు తగ్గకుండా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారని అంటున్నారు. కాస్త తగ్గించాలని కోరితే ఆయన కుదరదన్నారని పోలీసు ఉన్నతాధికారులకు ఆధారాలతో ఫిర్యాదు అందింది. ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే ఇందులో సాక్ష్యంగా ఉన్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం మేరకు ఆయన సుమారు రూ.70 లక్షలు వసూలు చేశారని ఆధారాలున్నట్లు తెలుస్తోంది. ఆయన పరిధిలో పోలింగ్ రోజు జరిగిన గొడవలపై ఇప్పటికే సీరియ్‌సగా ఉన్న ఉన్నతాధికారులు ఒకట్రెండు రోజుల్లో శాఖాపరమైన వేటు వేయబోతున్నట్లు తెలిసింది.
