13 విత్తన కంపెనీలపై వేటు
Published: Wednesday May 01, 2019

బీజీ-2 పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి లేని బీజీ-3 పత్తి విత్తనాలను తయారు చేస్తున్న 13 విత్తన కంపెనీలపై వేటుపడింది. ఈ కంపెనీల విత్తనాలు ఎక్కడైనా అమ్మకాలు చేపడితే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వ్యవసాయ శాఖ రాష్ట్ర కమిషనర్ మురళీధర్‌రెడ్డి 13 జిల్లాల వ్యవసాయ శాఖ జేడీలకు మంగళవారం ఆదేశాలు ఇచ్చారు. గతేడాది వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి గుంటూరులో విత్తన షాపులపై ఆకస్మిక తనిఖీ చేసిన సమయంలో బీజీ-2 పత్తి విత్తనాల ప్యాకెట్‌లలో బీజీ-3 విత్తనాలను నింపి వ్యాపారులు అమ్ముతున్న విషయం వెలుగుచూసింది. దీంతో అప్పట్లో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో సుమారు 700 బీజీ -2 ప్యాకెట్‌లలో విత్తనాల శాంపిల్స్‌ను అధికారులు పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపగా సుమారు 200 శాంపిల్స్‌లో బీజీ-3 ఉన్నట్టు తేలింది.
దీంతో బీజీ-3 పత్తి విత్తనాలు అమ్మకాలు, కో మార్కెటింగ్ చేసిన కంపెనీలపై ఈ ఖరీఫ్ సీజన్‌లో అమ్మకాల నిషేధం విధిస్తున్నట్టు కమిషనర్ మురళీధర్‌రెడ్డి తెలిపారు. కంపెనీల వివరాలు...
- నర్మదాసాగర్ అనే కంపెనీ ఎటువంటి విత్తనాలను రాష్ట్రంలో అమ్మకూడదని ఆదేశాలు ఇచ్చారు. ఆజాది బయో సైన్స్ అనే కంపెనీ ఏడాది పాటు ఏపీలో విత్తనాలు అమ్మకూడదని ఆదేశించారు.
- సాయి భవ్య, మై సీడ్స్, ప్రో సీడ్స్ జెనెటిక్స్, ఇండస్ వాలీ ఆగ్రో సీడ్స్, పాతూరు అగ్రి బయోటెక్ అనే కంపెనీల కో మార్కెటింగ్‌ను రద్దు చేశారు. వీటికి చెందిన పత్తి విత్తనాలను ఏపీలో ఏ కంపెనీ, వ్యాపారి కూడా కోమార్కెటింగ్ తీసుకోవద్దని సూచించారు.
- నూజివీడు సీడ్స్‌కు సంబంధించి ఎన్‌ఈ్‌స 459 రకం, కావేరికి చెందిన కేసీహెచ్ 707 పత్తి విత్తనం బులెట్ అనే పేరుతో అమ్ముతున్నారు. శ్రీరామ అగ్రి జెనెటిక్స్ అనే కంపెనీ ఎస్‌ఆర్‌సీహెచ్-99 అనే పేరుతో, నియో-1651 అనే రకం నవ్య పేరుతో, వెస్ట్రన్ సీడ్స్ అనే సంస్థ వెస్ట్రన్ నైరోబి-51 అనే పేరుతో, శ్రీ సత్య-54 ఎస్‌ఎస్ 33 అనే పేరుతో, అంకూర్ సీడ్స్ అనే సంస్థ అంకూర్ 3028 పేరుతో మార్కెట్‌లోకి బీజీ-3 పత్తి విత్తనాలు అమ్మినట్టు తేలింది. ఈ కంపెనీలు ఆ పేరుతో రాష్ట్రంలో పత్తి విత్తనాలు అమ్మకూడదని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
