ఈసీ వైఖరిపై విమర్శలు.. ఐటీ నిపుణుడు హరిప్రసాద్
Published: Monday April 15, 2019

ఈవీఎంల ట్యాంపరింగ్‌పై ఈసీ వైఖరి సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉంది. ఐటీ నిపుణులు వి.హరిప్రసాద్ విషయంలో దీనిని వర్తింప చేయడం లేదు. ఆయనపై ‘ఈవీఎం దొంగ’గా ముద్ర వేసి తప్పించుకోవాలని చూస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఇదే. ఈవీఎంల పనితీరు డొల్లగా బహిరంగంగా తేల్చిన హరిప్రసాద్ వాదనను, సూచనలను ఈసీ పట్టించుకోకపోవడాన్ని అనేక మంది తప్పుపడుతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన పోలింగ్‌లో ఈవీఎంలు మొరాయించడాన్ని ప్రశ్నిస్తూ సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ఒక బృందం శనివారం న్యూఢిల్లీలో ఎలక్షన్ కమిషన్‌ను కలిసింది. ఈ బృందంలో హరిప్రసాద్ కూడా ఉన్నారు. అయితే హరిప్రసాద్‌తో చర్చించడానికి ఈసీ నిరాకరించింది.
‘ఆయనెందుకు వచ్చారు? క్రిమినల్ కేసులు నమోదైన నేపథ్యంలో హరిప్రసాద్‌తో చర్చలు జరపడానికి ఎన్నికల కమిషన్ ఇష్టపడటం లేదు’ అని ఈసీ అధికారి సుదీప్ జైన్ టీడీపీ నేతలకు స్పష్టంచేశారు. దీంతో హరిప్రసాద్ పేరు దేశవ్యాప్తంగా మరోసారి చర్చలోకి వచ్చింది. వాస్తవానికి 2009 నుంచి ఈవీఎంల భద్రతను ప్రశ్నిస్తూ దేశ విదేశాలలో అనేక వేదికలపై హరిప్రసాద్ ప్రదర్శనలిచ్చారు. హైదరాబాద్ కేంద్రంగా నెట్ ఇండియా అనే ఐటీ కంపెనీకి ఎండీగా ఉన్న హరిప్రసాద్ 2010 ఏప్రిల్ 29న ఒక టీవీ చానల్‌లో ఈవీఎంల ట్యాంపరింగ్‌పై ఒక ప్రదర్శన ఇచ్చారు. అందులోని అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా హరిప్రసాద్ చేతిలోని ఈవీఎంపై దృష్టి పెట్టిన ఈసీ.. అది ముంబైలో చోరీకి గురైనదిగా తేల్చింది.
2010 మే 12న పోలీసులకు ఫిర్యాదు చేసి ఆయనపై ‘ఈవీఎం దొంగ’గా ముద్ర వేసింది. అదే ఏడాది ఆగస్టు 21న తెల్లవారుజామున డజను మంది పోలీసులు హైదరాబాద్ వచ్చి హరిప్రసాద్‌ను అరెస్టు చేశారు. 8 రోజులు కస్టడీలోకి తీసుకుని పోలీసులు ప్రశ్నించారు. థర్డ్ డిగ్రీ ఎలా ఉంటుందో రుచి చూపించారు. చీకటి గదిలో పడేశారు. కరుడుగట్టిన నేరుస్థులున్న సెల్‌లో వేశారు. వీటన్నింటీ హరిప్రసాద్ ఓపికగా భరించారు. అయితే కస్టడీలో పోలీసులు పెద్దగా సేకరించిన సమాచారం ఏమీ లేదు. ఆగస్టు 28న హరిప్రసాద్ బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ సందర్భంగా జడ్జి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ‘ఐటీ నిపుణుడిగా దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తించుకోవాలి. ఈ కేసులో ఉద్దేశపూర్వకంగా దొంగతనం చేశారనే భావన కనిపించడం లేదు’ అని పేర్కొన్నారు.
