అసెంబ్లీకి వెళ్లని జగన్‌కు పదవా? పవన్
Published: Monday April 08, 2019

ఏపీ రాజకీయాల్లో వేలుపెట్టి ఇబ్బంది పెడుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌తో వైసీపీ అధ్యక్షుడు జగన్ సన్నిహితంగా మెలుగుతున్నారని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ దుయ్యబట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం తెలంగాణ ఎంపీల మద్దతు తీసుకుంటామని చెప్తున్న జగన్... ఈ విషయంలో కేసీఆర్‌తో సానుకూల ప్రకటన చేయించగలరా..? అని నిలదీశారు. ఆదివారం విశాఖ జిల్లాలో పవన్ ప్రచారం నిర్వహించారు. అనకాపల్లి బహిరంగసభలో మాట్లాడుతూ... ఏపీలో బీసీలుగా ఉన్న గవర కులస్థులను తెలంగాణలో ఓసీలుగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌కు చేతనైతే ఆంధ్రాలో కూడా ఏపీ రాష్ట్ర సమితి పార్టీని పెట్టి పోటీ చేయాలని సవాల్ విసిరారు. కేసీఆర్, జగన్, మోదీ, చంద్రబాబుకు ఎన్నాళ్లు భయపడి బతుకుతామని ప్రశ్నించారు. టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు భూముల దోపిడీలో పోటీ పడుతూ ఉత్తరాంధ్రను ఉత్తాంధ్ర చేశారని, అందుకే ఉపాధి కోసం ప్రజలు వలస పోతున్నారని పవన్ అన్నారు. పెందుర్తి, గంగవరంలలో ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడుతూ... జనసేనకు అధికారం ఇస్తే వలసలకు అడ్డుకట్ట వేస్తామన్నారు. పెందుర్తిలో ఎమ్మెల్యే, ఆయన కుమారుడు భూములు ఆక్రమించుకున్నారని ఆరోపించారు. ప్రధాన పార్టీల నేతల్లో ఒకరు కుప్పంలో భూములను, మరొకరు ఇడుపులపాయలో ఎస్టేట్‌ను భద్రంగా ఉంచుకుని ఉత్తరాంధ్రాలో పేదల భూములు దోచుకుంటున్నారన్నారు. అసెంబ్లీకి వెళ్లని జగన్ సీఎం అయితే సమస్యలు ఎలా పరిష్కరిస్తాడని ప్రశ్నించారు. సమస్యను తొక్కిపెట్టేందుకు ‘మా షేర్ మాకివ్వండి’ అని పరిశ్రమల యాజమాన్యాలతో జగన్ బేరాలు పెట్టుకుంటారని పవన్ ఆరోపించారు.
