ఈసీకి ఫిర్యాదు చేస్తారా?.. అవన్నీ పాత కార్యక్రమాలే
Published: Friday April 05, 2019

రైతులకు, డ్వాక్రా మహిళలకు ఆర్థిక సాయం అందిస్తుంటే.. వారికి డబ్బు అందకుండా అడ్డుకునేందుకు కోడికత్తి పార్టీ నాయకులు ప్రయత్నించారని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. డబ్బు విడుదల ఆపాలని ఎన్నికల కమిషన్ దృష్టికి, ఆపై హైకోర్టుకు వెళ్లారని.. అవన్నీ పాతవి.. కొనసాగుతున్న కార్యక్రమాలు కావడంతో వారు కూడా ఏమీ చేయలేకపోయారని చెప్పారు. ‘రైతులు, డ్వాక్రా మహిళలకు ఇచ్చిన చెక్కులు చెల్లవంటూ ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఏమి మాట్లాడతారు. వాళ్లవే చెల్లుబాటు కాని ముఖాలు’ అని ధ్వజమెత్తారు. గురువారం ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా సభలు, రోడ్‌షోల్లో ఆయన ప్రసంగించారు. ‘నిన్న ప్రతి రైతుకు అన్నదాతా-సుఖీభవ కింద రూ.3 వేల వంతున జమ చేశాం. ఈ నెల 8న రైతు రుణమాఫీకి సంబంధించిన మిగిలిన మొత్తాలను రైతుల అకౌంట్లలో వేస్తాం. బ్యాంకుల్లో పసుపు-కుంకుమ నిధులు తీసుకోండి.
ఇవ్వబోమంటే ఎదురు తిరగండి. అలాగే పసుపు-కుంకుమ చివరి విడత రూ.4 వేలు నా చెల్లెమ్మల అకౌంట్లలో జమచేస్తా. తెలంగాణలో ఇప్పటికీ రూ.వెయ్యే పింఛను. ఇక్కడ రూ.2 వేలిస్తున్నాం. త్వరలో రూ. 3 వేలిస్తాం. రైతులకు అక్కడ రూ.లక్ష రుణమాఫీ చేస్తే ఇక్కడ రూ.1.50 లక్షలు చేశాం. డ్వాక్రా సంఘాలకు నయా పైసా కేసీఆర్ ఇవ్వలేదు. ఇక్కడ రెండు విడతలుగా పసుపు, కుంకుమ కింద రూ.10 వేల చొప్పున రూ.20 వేలు ఇచ్చా. మళ్లీ అధికారంలోకి రాగానే రాబోయే ఐదేళ్లలో మరో మూడుసార్లు ఇస్తా. రెండు పండుగలకు రెండు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తా. కోటిమంది చెల్లెమ్మలకు స్మార్ట్‌ఫోన్లు ఇస్తా. యువనేస్తం కింద నిరుద్యోగులకు రూ.3వేల భృతి ఇస్తా. ఇంటర్ చదివినవారికీ భృతి చెల్లించి ఆదుకుంటా. చంద్రన్న బీమాను రూ.10 లక్షలకు, పెళ్లికానుకను రూ.లక్షకు, ఆరోగ్యరక్షను అవసరమైతే రూ.20 లక్షల వరకు ఇచ్చి పేదలను ఆదుకుంటా.
రాష్ట్రంలో ఉన్న మాజీ సైనికుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా. వెలిగొండ ప్రాజెక్టుకు నేనే శంకుస్థాపన చేశా. ఈ సీజన్‌లోనే పూర్తిచేసి పశ్చిమ ప్రకాశంలో తాగు, సాగునీటి సమస్యలు పూర్తిగా తీరుస్తా. ఐదేళ్ల పాటు మీకోసం కష్టపడ్డాను. 5 రోజులు పాటు మీరందరు మీ పిల్లల భవిష్యత్ కోసం నిద్రాహారాలు మాని కష్టపడండి. ఇంటికొకరు సైనికుల్లా బయటకు వచ్చి టీడీపీ విజయానికి కృషిచేయాలి’ అని కోరారు. ‘వాన్‌పిక్ ప్రాజెక్టు కోసం జగన్ 24 వేల ఎకరాల భూములు కొట్టేశాడు. ఆ కేసు సీబీఐ విచారణలో ఉన్నది. దీనిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఆ భూములన్నింటిని ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకొని ఒక బ్రహ్మాండమైన వాన్‌పిక్ సిటీ నిర్మిస్తుంది. దాంతో పాటే పోర్టులు, విమానాశ్రయాలు నిర్మించి అభివృద్ధి చేస్తాం. కేసీఆర్ పెత్తనం వస్తే బాపట్లతో పాటు రాష్ట్రమంతా ఎడారిగా మారిపోతుంది’ అని హెచ్చరించారు.
