అసెంబ్లీకి వెళ్లనోళ్లు ప్రజలకేం చేస్తారు

Published: Wednesday April 03, 2019

 ‘‘వైసీపీ నాయకుడు జగన్‌ రెండేళ్లు జైలులో ఉండొచ్చి ఇప్పుడు సీఎం కావాలనుకుంటున్నారు. అలాంటప్పుడు ప్రజల కోసం పనిచేస్తున్న జన సైనికులు పదవులు కోరుకోవడంలో తప్పేముంది?’’ అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ప్రశ్నించారు. పవన్‌స్టార్‌ను కాను.. మీ భవష్యత్తును నిర్మించే సైనికుడినని వ్యాఖ్యానించారు. మంగళవారం విశాఖపట్నం జిల్లా ఎలమంచిలిలో ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడారు. ‘టీడీపీ, వైసీపీ నాయకులు గతంలో ఒకరి అవినీతిపై మరొకరు పుస్తకాలు వేశారు. వైసీపీ నాయకుడు జగన్‌ రూ.లక్ష కోట్లు అవినీతికి పాల్పడితే, టీడీపీ నాయకులు రూ.3లక్షల కోట్లు దోచేశారు. విశాఖలో వైజాగ్‌ ఫెస్ట్‌ పేరుతో టీడీపీ నాయకులు కోట్ల రూపాయలు వృథా చేస్తున్నారు. విశాఖ డెయిరీని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు పాలకులు ప్రయత్నాలు చేస్తున్నారు’ అని విమర్శించారు. సమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీకి వెళ్లని జగన్‌..ప్రజలకు ఏం చేస్తారని పవన్‌కల్యాణ్‌ ప్రశ్నించారు. ‘‘సెజ్‌ల కోసం భూములు సేకరించడం సరైనదే. అయితే, ఆ భూములను బ్యాంకుల్లో కుదవబెట్టి నాయకులు రుణాలు పొందడం సరైనదేనా? జనసేన అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని సెజ్‌లలో 50 శాతం ఉద్యోగాలు స్థానిక యువతీ యువకులకే ఇస్తాం. సంపద సృష్టించి, పేద ప్రజలకు కుల,మతాలకు అతీతంగా పంచుతాం. సగటున ప్రతి కుటుంబానికీ నెలకు రూ.10 వేలు చేరేలా చూస్తాం’’ అని ఆయన హామీ ఇచ్చారు. ప్రస్తుత పాలకుల వ్యవహారశైలితో యువత భవిష్యత్తు ఏమవుతుందోనని భయపడుతున్నానని, వారిని ఆదుకోవడానికే రాజకీయాల్లోకి వచ్చానని వివరించారు. ఎన్నికలకు రెండు నెలల ముందు యువకులకు నిరుద్యోగ భృతి ఇవ్వడం సరైన పద్ధతి కాదన్నారు. జనసేన అధికారంలోకి వస్తే లక్షలాది మంది యువతకు ఉద్యోగాలు కల్పించే బృహత్తర ప్రణాళిక అమలు చేస్తామని, ప్రతి జిల్లాలో వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటుచేస్తామని, యువతీ యువకుల పోటీ పరీక్షల ఫీజులు ఏడాదికి ఒక్కసారి మాత్రమే చెల్లించేలా ఏర్పాట్లు చేస్తామని, ఆరు నెలల్లో మూడు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసి యువతకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పరిశ్రమల్లో జీరో డ్రగ్‌ లిక్విడ్‌ ఉండేలా చేసి, మత్స్యకారులను ఆదుకొంటామన్నారు. ‘‘మేం అధికారంలోకి రాగానే కుటుంబంలోని సభ్యులను బట్టి పది వరకు వంట గ్యాస్‌ సిలెండర్లు ఉచితంగా ఇస్తాం. ప్రతి నెలా తెల్లరేషన్‌కార్డుదారులకు సరుకులకు బదులు కుటుంబ సభ్యుల సంఖ్య ఆధారంగా రూ.2,500 నుంచి 3,500 వరకు బ్యాంకుల్లో వేస్తాం. 60 ఏళ్లు దాటిన ప్రతి రైతుకు, 58 ఏళ్లు నిండిన మత్స్యకారులకు నెలకు రూ.5 వేలు పింఛన్‌ అందిస్తాం. 18 ఏళ్లు నిండిన ప్రతి పేదింటి ఆడబిడ్డ పెళ్లికి మాఇంటి మహాలక్ష్మి పథకం కింద రూ.లక్ష, సారెచీరల కోసం మరో రూ.10,116 అందిస్తాం’’ అని తెలిపారు. జనసేనకు పెద్ద నాయకులెవరూ లేరని అంటున్నారని, ఎలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు స్ర్కాప్‌ అమ్ముకుని ఎమ్మెల్యేగా గెలిచారన్నారు. అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు పార్లమెంట్‌లో ఎప్పుడూ నిద్రపోయేవారని ఎద్దేవా చేశారు. క్వారీల ద్వారా వచ్చే ఆదాయంలో అధికార పార్టీ నాయకులు 60 శాతం, ప్రతిపక్ష నాయకులు 40 శాతం చొప్పున వాటాలు పంచుకోవడం దురదృష్టకరమన్నారు. ‘‘జన సైనికుల్లో పాతవాసన పోవాలి. పవన్‌కల్యాణ్‌ ఇప్పుడు పవర్‌స్టార్‌ కాదు. మీ అందరి బాధ్యత చూడాల్సిన బాధ్యత గల సేవకుడు’’ అని వ్యాఖ్యానించారు.