ప్రధాని హోదాలో మోదీ సర్పంచ్‌లా మాట్లాడారు.
Published: Monday April 01, 2019

‘‘మిషన్ భగీరథ అద్భుత పథకం. ఇలాంటి పథకం దేశంలో మరే రాష్ట్రంలోనూ లేదు. అందుకే ఇంటింటికీ నీళ్లు ఎలా ఇవ్వాలో 11 రాష్ట్రాలు తెలంగాణను చూసి నేర్చుకున్నాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా మేమే రైతులకు 24 గంటల కరెంటును ఇస్తున్నాం. మా రైతు బంధును కూడా నకలు కొట్టావు కదా మోదీ? మీరు చేయరు. చేసే వాళ్లకు దేశంలో పేరు వస్తే ఓర్వరు. మోదీ.. తెలంగాణను చూసి నేర్చుకో’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. వనపర్తి, మహబూబ్‌నగర్‌ల్లో ఆదివారం ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు. ‘‘మోదీ.. ఈ దేశానికి మీరు ఏం చేశారు!? రైతు బంధు, రైతు బీమా ఎందుకు పెట్టలేదు? రైతులు చస్తే పీనుగుల మీద దండలు వేశారు తప్ప ఏం చేశారు? చేయకుండా మిమ్మల్ని ఎవరు ఆపారు? పైగా నన్ను ఆడిపోసుకునుడేంది? అమిత్ షా, రాహుల్, మోదీ అంతా ఒకటే. మోదీ సొంత రాష్ట్రంలో.. దేశంలోని ఇంకే రాష్ట్రంలో అయినా 24 గంటల కరెంటు ఇస్తున్నారా? రైతులకు నిజమైన బంధువుగా ఉన్నది తెలంగాణ మాత్రమే.
డబుల్ బెడ్ రూం ఇళ్లు మెల్లగానే కడుతున్నాం. కానీ, పేదలు అప్పు చేయాల్సిన పని లేకుండా ఇళ్లు ఇస్తున్నాం. తెలంగాణ పథకాల గురించి ఇతర రాష్ట్రాల్లో ప్రకటనలు ఇస్తున్నాం. వాటిని చూసి ఇతర రాష్ట్రాల్లో డిమాండ్ చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులకు 30 శాతం అలవెన్సు ఇస్తున్నాం. తెలంగాణ తరహాలో మాకు ఎందుకు ఇవ్వరని మహారాష్ట్రలో సమ్మె చేస్తున్నారు. మోదీది మేధావితనం, రాహుల్ గాంధీది తెలివి కల పని అయితే మంచి ఆలోచనలు ఎందుకు చేయలేదు!? వాళ్లను ఎవరైనా ఆపారా? ఈ స్కీంలన్నీ అమలు చేస్తుంటే వాళ్లకు భయం పట్టుకుంది. కేసీఆర్ గాడు ఢిల్లీకి బయల్దేరుతాడేమో?నని భయపడుతున్నారు. కాంగ్రెస్, బీజేపీల పీఠాలు కదులుతున్నాయి. వీడు ఇటు వచ్చి దుకాణం పెడితే సినిమాలో విలన్లను తరిమినట్టు ప్రజలు తమను కూడా ఉరికిస్తరని భయం పట్టుకుంది’’ అని కేసీఆర్ ఎద్దేవా చేశారు. తాను చెప్పింది తప్పయితే టీఆర్‌ఎ్‌సకు డిపాజిట్లు పోగొట్టాలని, నిజమైతే అవతలి వాళ్ల డిపాజిట్లు పోగొట్టాలని పిలుపునిచ్చారు.
