ప్రజాశాంతి పార్టీ అభ్యర్థుల తొలిజాబితా విడుదల

అవినీతి లేని రాజ్యం ప్రజాశాంతి పార్టీతోనే సాధ్యమని ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ చెప్పారు. తనకు అవకాశం ఇస్తే సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌ను అమెరికాలా మారుస్తానన్నారు. 13 ఎమ్మెల్యే, 2 ఎంపీ అభ్యర్థులతో పార్టీ తొలి జాబితాను గురువారం విజయవాడలోని ఓ హోటల్‌లో ఆయన ప్రకటించారు. మిగిలిన అభ్యర్థులను త్వరలో ప్రకటిస్తానన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరసాపురం లోక్‌సభ, పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థిగా శుక్రవారం తాను నామినేషన్ వేయనున్నట్టు చెప్పారు. లక్ష కోట్లు ఉన్న జగన్‌పై లక్షరూపాయలున్న ఆయన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినే పోటీకి నిలబెడుతున్నట్టు చెప్పారు. పవన్‌కు ఒక్క అవకాశం ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ విజయం తథ్యమన్నారు. ప్రజాశాంతి పార్టీ గెలుపును ఆపేందుకే కుట్రపూరితంగా ఎన్నికలు త్వరగా పెట్టారని ఆరోపించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కొర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
