చంద్రన్న స్కాలర్ షిప్‌లు ఇక కేంద్రం నుంచి

చంద్రన్న బీమా పథకం లబ్ధిదారుల కుటుంబాల్లోని విద్యార్థులకు ఇస్తున్న స్కాలర్‌షిప్‌లు ఇక నుంచి కేంద్రమే నేరుగా ఇవ్వనుంది. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన-చంద్రన్న బీమా పేరుతో అమలవుతున్న ఈ పథకం ఇప్పటి వరకు రాష్ట్ర విద్యాశాఖ పరిధిలోని సెకండరీ విద్య బోర్డు, ఇంటర్మీడియట్ బోర్డు, టెక్నికల్ ఎడ్యుకేషనల్ విభాగాల ద్వారా అమలవుతోంది. సెర్ప్ దీన్ని సమన్వయం చేసి పర్యవేక్షిస్తోంది. ఈ విభాగాలు అర్హులైన విద్యార్థుల వివరాలను నేరుగా ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్‌లోడ్ చేస్తుండడంతో, విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో స్కాలర్‌షిప్‌లు జమ అవుతున్నాయి.
కానీ, ఇక నుంచి విద్యార్థులు నేరుగా స్కాలర్‌షిప్స్ .జీఓవీ.ఇన్ వెబ్‌పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తనవంతు మ్యాచింగ్ ప్రీమియంగా రూ.259.76 కోట్లు చెల్లించింది. ఇది కాకుండా, ఈ పథకం ప్రకటించిన మొదటి ఏడాది ప్రమాద మరణాలకు చెల్లించే రూ.5 లక్షల బీమా కోసం అదనంగా రూ.80 కోట్లు చెల్లించింది. కాగా కేంద్రం నేరుగా దీన్ని అమలు చేయాలని నిర్ణయించడంతో ఇప్పటి వరకు దీన్ని సమన్వయం చేస్తున్న సెర్ప్ ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టింది.
