గుడివాడ బరిలో పోరు రసవత్తరం

Published: Thursday March 21, 2019
టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ సొంతగడ్డ అయిన గుడివాడపై పట్టు సాధించేందుకు టీడీపీ, వైసీపీ హోరాహోరీగా తలపడుతున్నాయి. రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు సంతరించుకున్న గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల వేడి పతాకస్థాయికి చేరింది. టీడీపీ అభ్యర్థిగా దేవినేని అవినాష్‌ ఎన్నికల బరిలోకి దిగడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. వైసీపీ పక్షాన సిట్టింగ్‌ ఎమ్మెల్యే కొడాలి నాని బరిలో ఉండటంతో ఇక్కడి పోరు జిల్లా వ్యాప్తంగా అసక్తి కలిగిస్తోంది. ఇద్దరూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. టీడీపీ కంచుకోటగా ఉన్న ఈ స్థానం నుంచి గత ఎన్నికల్లో టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్‌ చేసిన సిట్టింగ్‌ ఎమ్మెల్యే కొడాలి నాని విజయం సాధించారు. ఆయన పార్టీని వీడే క్రమంలో సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం టీడీపీ శ్రేణుల్లో ఆగ్రహాన్ని పెంచాయి. గుడివాడ పట్టణంలో వైసీపీ కార్యాలయాన్ని ఖాళీ చేసే విషయంలోనూ ఎమ్మెల్యే నాని సీఎం చంద్రబాబుపై నోరుపారేసుకున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే నానిని ఓడించాలని టీడీపీ అధిష్ఠానం తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ను రంగంలోకి దింపింది.
 
టీడీపీ క్యాడర్‌ను ఎమ్మెల్యే నాని తనతో తీసుకువెళ్లిపోవడంతో 2014లో టీడీపీ అభ్యర్థి రావి వెంకటేశ్వరరావు ఓడిపోవాల్సి వచ్చింది. ఆయన నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి హోదాలో ఈ నియోజకవర్గంలో రూ.1400 కోట్లు విలువ చేసే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి పార్టీని బలోపేతం చేశారు. బూత్‌ స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేసుకుంటూ వచ్చారు. రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ బరిలోకి దిగడంతో పార్టీ నేతలు గ్రూపు విభేదాలు వీడి టీడీపీ గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఒక్కటిగా పనిచేస్తున్నారు.
 
ప్రజల్లో ఒకడిగా కలసిపోతూ అవినాష్‌ చేస్తున్న ప్రచారం మాస్‌లో ఆయనపై విపరీతమైన క్రేజ్‌ను పెంచుతోంది. మున్సిపల్‌ చైర్మన్‌ యలవర్తి శ్రీనివాసరావుకు, నందివాడ, గుడ్లవల్లేరు మండలాలు, గుడివాడ మండలంలో సగభాగం గతంలో ముదినేపల్లి నియోజకవర్గంలో భాగమై ఉండటంతో అక్కడి నుంచి సుదీర్ఘ కాలం ప్రాతినిధ్యం వహించిన ఆప్కాబ్‌ చైర్మన్‌ పిన్నమనేని వెంకటేశ్వరరావుకు ఆయా మండలాల్లో బలమైన వర్గముంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ ఓట్లను రాబట్టుకునే ప్రయత్నంలో టీడీపీ నాయకులు ఉన్నారు. టీడీపీ జెండా గుడివాడ గడ్డపై మళ్లీ ఎగరనుందని ఆ పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 1983 నాటి పూర్వవైభవం సాధించేదిశగా కదం తొక్కుతున్నారు.