అక్రమ మద్యంపై నిఘా నిల్
Published: Thursday March 14, 2019

ఎన్నికల సమయంలో మద్యం అమ్మకాలు అత్యంత కీలకం. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నాయకులకు ఇదే ఆయుధం. ఇలాంటి వాటిపై ఎక్సైజ్ శాఖ నిఘా ఉండాలి. మద్యం దుకాణాల్లో ఎప్పటికప్పుడు పాత అమ్మకాలు, ప్రస్తుతం జరుగుతున్న విక్రయాలపై ఆరా తీయాలి. బెల్టు షాపులు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పన్ను కట్టని మద్యం, నాటుసారా, కల్తీ మద్యం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ, ఈ ఎన్నికల్లో ఎక్సైజ్ శాఖ అతిజాగ్రత్తకు పోయి.. అసలు కొంటే కొసరుపైనే ఎక్కువ దృష్టిపెట్టిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. సిబ్బందిని నివేదికలకే పరిమితం చేసి క్షేత్రస్థాయిలో నిఘాను గాలికొదిలేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నంత కాలం ప్రతి స్టేషన్ నుంచి ఎక్సైజ్ సిబ్బంది అధికారులకు నివేదికలు పంపాలి. ఒక షాపు గతేడాది ఇదే సమయానికి ఎంత అమ్మింది. ఇప్పుడు ఎంత అమ్మింది అనే వివరాలు రోజువారీగా చేరవేయాలి. వీటిని ఆన్‌లైన్‌లో ప్రతిరోజూ ఉదయం 8కల్లా పంపించాలన్నది అధికారుల ఆదేశం.
వాస్తవానికి మద్యం షాపులు రాత్రి 10 గంటల వరకూ, బార్‌లు రాత్రి 11 గంటల వరకూ పనిచేస్తాయి. ఆ తర్వాత గంటకు ఆ రోజు అమ్మకాల వివరాలను ఎక్సైజ్ సిబ్బందికి ఇస్తారు. ఒక్కో స్టేషన్ పరిధిలో మద్యం షాప్‌లు, బార్‌లు సగటున 20 వరకూ ఉంటాయి. వివరాలు అప్‌లోడ్ చేయడానికి ఉద్దేశించిన వెబ్‌సైట్ రాత్రి 12 గంటల తర్వాత ఓపెన్ అవుతుంది. అప్పటి నుంచి తెల్లవారే వరకూ ఆ నివేదికలు రూపొందించడమే సిబ్బందికి పెద్ద పని. కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు ఆ వివరాలు 6 గంటలకే పంపాలని ఆదేశిస్తున్నారు. ఒక్కో షాప్‌నకు 8 రకాల వివరాల చొప్పున 80 ఎంట్రీలు నమోదు చేయాలి.
ఉదాహరణకు గుంటూరునే తీసుకుంటే 60 మద్యం షాప్‌లు, బార్‌లు ఉన్నాయి. వీటికి రాత్రంతా కలిసి 500 రకాల వివరాలు నింపి సిబ్బంది నివేదికలు సిద్ధం చేస్తున్నారు. సీఐ నుంచి కానిస్టేబుల్ వరకూ ఇతరత్రా పనులన్నీ వదిలేసి ఈ పనిలోనే ఉంటున్నారు. ఈ క్రమంలో అసలు బెల్టు షాపుల వైపు చూసేవారే కరువయ్యారు. నిఘా విషయంలో ఎక్సైజ్ యంత్రాంగం విఫలమవుతోంది. చెక్‌పోస్టులు, సెంట్రీ డ్యూటీ మినహాయిస్తే ముగ్గురు, నలుగురు కానిస్టేబుళ్లు మాత్రమే ఉంటున్నారు. వీరిపని నివేదికలు సిద్ధం చేయడమే. అందుకే కొంత వెసులుబాటు కల్పించాలని ఎక్సైజ్ ఎగ్జిక్యూటివ్ అధికారుల సంఘం అధ్యక్షుడు బి.నర్సింహులు బుధవారం కమిషనర్ మీనాకు వినతిపత్రం సమర్పించారు.
