అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ముమ్మరం

Published: Tuesday March 12, 2019
 ఎన్నికల షెడ్యూల్‌ వెలువడడంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పీడు పెంచేశారు. ఇందులో భాగంగానే ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ముమ్మరం చేశారు. సోమవారం అమలాపురం, రాజమండ్రి ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. అమలాపురం నుంచి డీఎంఆర్‌ శేఖర్‌, రాజమహేంద్రవరం నుంచి ఆకుల సత్యనారాయణ పోటీ చేయబోతున్నట్లు అధికారిక ప్రకటన వెలువడిన విషయం తెలిసిందే. వీరిలో శేఖర్ ఓఎన్జీసీ రాజమహేంద్రవరం అసెట్‌ మేనేజర్‌, ఈడీగా పని చేస్తేూ, తన ఉద్యోగాన్ని వదులుకుని ఎన్నికల బరిలోకి దిగగా, ఆకుల సత్యనారాయణ.. 2014 ఎన్నికల్లో బీజేపీ తరఫున రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఇటీవల ఆయన జనసేనలో చేరారు.
 
మరోవైపు, జనసేన అభ్యర్థుల జాబితా విడుదలపై కూడా క్లారిటీ వచ్చేసింది. ఈ మేరకు సోమవారం జనసేన పార్టీ కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదలైంది. ‘‘32 అసెంబ్లీ స్థానాలకు, మ‌రో 7 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను రేపు లేదా ఎల్లుండి ప్ర‌క‌టించ‌నున్నారు. మ‌రే పేర్లు ఇవాళ ప్ర‌క‌టించ‌లేదు’’ అంటూ అందులో పేర్కొంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం జనసేనాని ఈ జాబితాను నేడు ప్రకటించే అవకాశాలు ఉన్నాయట. వాస్తవానికి కొద్దిరోజుల కింద అభ్యర్థుల ఎంపిక కోసం పవన్.. ఓ కమిటీని కూడా వేశారు. ఈ కమిటీ ఆశావాహుల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తుండడంతో అభ్యర్థుల జాబితా విడుదల చేయాలని పవన్ భావిస్తున్నారు.