నేడో, రేపో అభ్యర్థుల తొలి జాబితా
Published: Monday March 11, 2019

ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్‌తో ఎన్నికల బరిలోకి దిగేందుకు జనసేన సై అంటోంది. ఒకటి రెండు రోజుల్లోనే అభ్యర్థుల తొలి జాబితా విడుదలయ్యే అవకాశముంది. పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేయాలో నిర్ణయం తీసుకోలేదు. గత నెల 13 నుంచి 25వ తేదీ దాకా లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థిత్వాల దరఖాస్తులను జనసేన స్వీకరించింది. సీనియర్ నేతలు నాదెండ్ల మనోహర్, ఆకుల సత్యనారాయణ, రావెల కిశోర్‌బాబు, పసుపులేటి బాలరాజు, ముత్తంశెట్టి కృష్ణారావు దంపతులు మినహా దాదాపు అందరూ కొత్తవారే దరఖాస్తు చేశారు.
సమాజంలోని విభిన్న వర్గాలు, రాజకీయాల్లోకి కొత్తగా అడుగుపెట్టిన వైద్యులు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, విద్యాధికులు 2410 మంది వరకూ ఎన్నికల్లో పోటీ చేస్తామంటూ దరఖాస్తులు చేశారు. వాటన్నింటినీ నియోజకవర్గాల వారీగా పవన్ ఆదివారం జరిగిన సర్వసభ్య సమావేశంలో పరిశీలించారు. అయితే, వామపక్షాలతో పొత్తు దృష్ట్యా... అవి ప్రతిపాదించిన సీట్లను మినహాయించి మిగిలిన స్థానాల్లో అభ్యర్థుల ఖరారుపై పవన్ దృష్టి సారించారు. ఒకటి రెండు రోజుల్లో తుది నిర్ణయం తీసుకుంటారు. జనసేనను స్థాపించాక ప్రత్యర్థి పార్టీల నుంచి బలమైన నే తలు వచ్చి చేరతారని పవన్ ఆశించారు.
ప్రధానంగా ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఈ వలసలు అధికంగా ఉంటాయని భావించారు. కానీ, అలాంటిదేమీ జరగలేదు! పోరాటయాత్రల పేరిట జిల్లాల్లో పర్యటించే సమయంలోనూ, జనబలం కలిగిన నేతలతో సంప్రదింపులు జరపడంలోనూ పవన్ విఫలమయ్యారని రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ నెల 13న రాజమహేంద్రవరంలో జనసేన అధ్యక్షుడు నిర్వహించే బహిరంగ సభలో ఎన్నికల కార్యాచరణ వెల్లడయ్యే వీలుందని భావిస్తున్నారు.
