ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్ లో 15 గంటల పాటు ధర్మపోరాట దీక్ష
Published: Wednesday March 06, 2019

వాల్తేరు డివిజన్‌తో కూడిన రైల్వే జోన్ ప్రకటించాలని శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు డిమాండ్ చేశారు. అప్పటి వరకు టీడీపీ పోరాడుతుందని స్పష్టం చేశారు. డిమాండ్ సాధనే లక్ష్యంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్ ఆవరణలో మంగళవారం సాయంత్రం 6 గంటలకు ధర్మపోరాట దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ తీరుపై ఎంపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీ తన విశాఖ పర్యటనకు ఇబ్బంది లేకుండా చేసుకునే క్రమంలోనే జోన్ ప్రకటించారు తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదని మండిపడ్డారు. అందుకే ధర్మపోరాట దీక్షకు దిగినట్టు చెప్పారు. నాలుగున్నరేళ్ల పాటు పోరాటం చేస్తే చరిత్ర కలిగిన వాల్తేరు డివిజన్ లేకుండా జోన్ ప్రకటించడం రాష్ట్రంపై కేంద్రానికి ఉన్న వివక్షను తేటతెల్లం చేస్తోందన్నారు. ఉత్తరాంధ్రలోని అన్ని రైల్వేస్టేషన్లను విశాఖ జోన్‌లోకి తేవాలని డిమాండ్ చేశారు.
వాల్తేరు డివిజన్‌ను ఎందుకు తొలగించారో చెప్పాలని అడిగితే కేంద్ర ప్రభుత్వం కానీ, మంత్రులు కానీ సమాధానం చెప్పకపోవడం దారుణమన్నారు. కొత్తగా ప్రకటించిన జోన్‌లో ఎన్ని స్టేషన్లు వస్తున్నాయి? రాయఘడకు ఎంత భాగం కేటాయించారు? వారికిచ్చే ఆదాయమెంత? మనకొచ్చేదెంత? అన్న విషయాలపై స్పష్టత ఇవ్వలేకపోతున్నారని దుయ్యబట్టారు. రాజకీయ లబ్ధి కోసం విధివిధానాలు లేకుండా జోన్ ప్రకటించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ జోన్‌ను రాష్ట్ర ప్రజలు అంగీకరించరని ఎంపీ రామ్మోహన్‌నాయుడు స్పష్టం చేశారు.
అత్యంత ఆదాయం సమకూర్చే కిరండోల్ లైన్‌లో 70% రాయగడకు, 30% విశాఖ జోన్‌కు ఏ ప్రాతిపదికన కేటాయించారో చెప్పాలని డిమాండ్ చేశారు. గుంటూరు పర్యటనలో ప్రజాగ్రహాన్ని చూసి విశాఖలో అదేవిధమైన ఆగ్రహం తలెత్తకుండా ఉండేందుకే హడావుడిగా జోన్ ప్రకటించారని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా విషయంలో మోసం చేసిన ప్రభుత్వం రైల్వేజోన్ విషయంలో మాయ చేసిందన్నారు. వాల్తేర్‌తో కూడిన రైల్వేజోన్ ప్రకటించే వరకూ ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడతానని చెప్పారు. కాగా, దీక్ష బుధవారం ఉదయం 9 గంటల వరకు కొనసాగుతుందని ప్రకటించారు. దీక్షకు జడ్పీ చైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మి, ఎమ్మెల్యేలు బెందాళం అశోక్, కలమట వెంకటరమణ, పార్టీ జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీష మద్దతు పలికారు
