రేపే భారత్ పైలట్ విడుదల..
Published: Thursday February 28, 2019

న్యూఢిల్లీ: పాకిస్తాన్ చేతుల్లో బందీ అయిన భారత సాహస పైలట్ అభినందన్ వర్థమాన్ కోసం భారత్ తీసుకున్న చర్యలు ఫలించాయి. ఐక్య రాజ్య సమితి నీడలో భారత్ తీసుకొచ్చిన దౌత్యపరమైన ఒత్తిడితో పాకిస్తాన్ దిగివచ్చింది. ఆయనను రేపు విడుదల చేయనున్నట్టు పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ వెల్లడించారు. పాకిస్తాన్ పార్లమెంటు వేదికగా ఆయన ఈ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా పార్లమెంటు సభ్యులంతా బల్లలు చరుస్తూ హర్షాతిరేకాలు వ్యక్తం చేయడం విశేషం.
జమ్మూ కశ్మీర్‌లోని సైనిక స్థావరాలపై దాడులకు ప్రయత్నించిన పాకిస్తాన్ వైమానిక దళాన్ని తిప్పికొట్టే క్రమంలో ఐఏఎఫ్‌కి చెందిన మిగ్21 యుద్ధవిమానం ఒకటి పాక్ భూభాగంలో కూలిపోయింది. పాక్ విమానాలను తిప్పికొట్టిన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను పాకిస్తాన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పాకిస్తాన్‌కి చెందిన ఎఫ్-16 విమానాన్ని కూడా ఐఏఎఫ్ కూల్చివేసిన సంగతి తెలిసిందే.
